- ఇప్పుడే కావాలనే తొందర లేదు
- భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నల్లగొండ: కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ స్థానానికి ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పట్టణంలో జరిగిన రోడ్ షోలో కోమటిరెడ్డి మాట్లాడుతుండగా.. సీఎం.. సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు. ‘మీరు ఏమంటున్నారో నాకు అర్థమైంది. రాష్ట్ర చరిత్రలో వివిధ జిల్లాల నుంచి కొందరు సీఎంలు అయ్యారు. ఎప్పుడో ఒకప్పుడు నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం అయ్యే రోజు వస్తుంది. కానీ మీకున్న తొందర నాకు లేదు' అని కోమటిరెడ్డి అన్నారు. మాయమాటల చెప్పి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని.. ఏపీలో నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన లక్ష్యం నెరవేరలేదని.. ఆత్మహత్యల కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకోలేదన్నారు. ఉద్యోగాల భర్తీలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని.. పోలింగ్ చివరి రోజు రైతుబంధు డబ్బులు వేస్తారని మోసపోవద్దని కోమటిరెడ్డి సూచించారు..