ఎంపీగా బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలె

ఎంపీగా బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలె

కరీంనగర్ జిల్లా: కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఇప్పటివరకు తాను ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ డిమాండ్ చేశారు. వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. తాను కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. టెక్స్టైల్ పార్కును కాంగ్రెస్ హయాంలోనే ఏర్పాటు చేశామన్న ఆయన... టీఆర్ఎస్, బీజేపీ హయాంలో చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోని బండి సంజయ్... ప్రతి అంశంను రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ను  జైల్లో పెడతానని 100 సార్లు చెప్పిన సంజయ్... ఒక్కసారి కూడా కేసీఆర్ ను ఏం చేయలేకపోయారన్నారు. ఇక సీఎం కూతురు కల్వకుంట్ల కవితను ఓడించడానికే ధర్మపురి అర్వింద్ ను ఎంపీగా గెలిపించారే తప్ప మరొకటి కాదన్నారు.  

నిత్యవసర ధరలు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల నడ్డివిరుస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కరీంనగర్ లోక్ సభ పరిధిలో ఆగస్టు 9 నుంచి 18 వరకు పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. గంభీరావుపేట క్రాస్ రోడ్డు నుంచి ఎల్కతుర్తి వరకు పాదయాత్ర కొనసాగతుందని చెప్పిన ఆయన... కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన వ్యవసాయ విప్లవం, పంచవర్ష ప్రణాళికలు, పారిశ్రామిక విప్లవం దేశ ఆర్ధిక ప్రగతిని ముందుకు తీసుకుపోయాయన్నారు.