ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులది కీలకపాత్ర. ఉద్యమ సమయంలో కార్మికులను స్వప్రయోజనాలకు వాడుకున్న కేసీఆర్.. ఇప్పుడు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. తాడిచర్ల మైనింగ్ ప్రైవేటీకరణను తెలంగాణ ఉద్యమ సమయంలో గట్టిగా వ్యతిరేకించిన కేసీఆర్.. అధికారంలోకి రాగానే తాడిచర్ల ఓపెన్ కాస్ట్‌ను తన అనుచరులకు కట్టబెట్టారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్‌తో చెన్నూరును బొందల గడ్డగా మార్చింది ఈ బీఆర్‌ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ కూతురు కవిత కార్మికులను ప్రలోభాలకు గురిచేసి సింగరేణి కార్మిక నాయకురాలుగా గెలిచినా, శ్రామిక లోకానికి ఆమె చేసిందేమీ లేదు. పైగా ఆమె హయాంలో సంస్థ ఉద్యోగాలను బీఆర్‌ఎస్ నేతలు అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయి. వామపక్షాలు కూడా ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్‌తో జతకట్టి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకుండా శ్రామికుల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయి.
కేసీఆర్ కుటుంబంతో పాటు వారి అనుచరగణం అవినీతి వ్యవహారాలతో విసిగిపోయిన కార్మికులు సింగరేణి బతకాలంటే వారి ఆశాకిరణం ఐఎన్‌టీయూసీ తిరిగి రావాలని బలంగా కోరుకుంటున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై సింగరేణి కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడటంతో ప్రభుత్వం కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణకు జంకుతోంది. 2019లో నిర్వహించాల్సిన ఎన్నికలను తొలుత కరోనా సాకుతో వాయిదా వేస్తూ వచ్చిన సింగరేణి యాజమాన్యం ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ఇప్పటి వరకూ నిర్వహించలేదు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి నియామకాల అంశం. ప్రత్యేక రాష్ట్రం అవిర్భావం తర్వాత మన ఉద్యోగాలు మనకే అని ప్రలోభ పెట్టిన అప్పటి టీఆర్‌ఎస్.. అనంతరం వాటి ఊసే మరిచింది.
తెలంగాణలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ఏడు జిల్లాల్లో సింగరేణి బొగ్గు తవ్వకాల కోసం ఒకప్పుడు లక్షా 30 వేల మంది కార్మికులు విధులు నిర్వహించగా, ఇప్పుడు ఆ ఉద్యోగుల సంఖ్య దాదాపు 45 వేలకు పరిమితమవడం ప్రభుత్వ వైఫల్యం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సింగరేణిలో దాదాపు 20 వేల మంది పర్మినెంట్ కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు, రిటైర్మంట్ అయ్యారు. ఈ పోస్టుల్లో కొత్తగా నియామకాలు లేవు. కాంట్రాక్టు కార్మికులు10 వేల నుంచి 33 వేలకు పెరిగారు. ఇక పరోక్షంగా సింగరేణిపై ఆధారపడ్డ కార్మికుల ఆవేదన వర్ణనాతీతం. దీనికి ప్రధాన కారణం సింగరేణిని దశలవారీగా ప్రైవేటీకరించడమే. సింగరేణిని ప్రైవేట్ వారికి అప్పనంగా అప్పచెబుతూ అంతర్గతంగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రోత్సహిస్తూ సంస్థను కాంట్రాక్టుల కబంధ హస్తాలతో బలిచేస్తున్నారు. ‘మన రాష్ట్రం మన ఉద్యోగాలు’ అంటూ బీరాలు పలికిన బీఆర్‌ఎస్ నేతలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తీసుకుంటూ స్థానికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ 2014 మానిఫెస్టోలో ప్రధానమైన డిపెండెంట్ ఉద్యోగాల విధానంపై కార్మికుల కుటుంబాలు ఎన్నో ఆశలు పెట్టుకోగా, కేసీఆర్ ప్రభుత్వం దీనిపై చిత్తశుద్ధి కనబర్చకపోవడంతో అది ఒక కొలిక్కి రాలేదు. కొత్తగా భూగర్భ గనుల తవ్వకం చేపడుతామని 2014 మానిఫెస్టోలో చెప్పారు, ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదు. సింగరేణి గనులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందంటూ ఆరోపించే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ నిర్ణయాలను అడ్డుకోవడానికి సీరియస్‌గా ప్రయత్నించకుండా చోద్యం చూస్తోంది. కొత్తగూడెంలో మైనింగ్ విశ్వవిద్యాలయం కోసం మానిఫెస్టోలో ప్రకటించినా దీనికి ఒక అడుగు కూడా ముందుకు పడలేదు.
సింగరేణి యాజమాన్యం తీరుపైనా అనుమానం
కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు పన్నుతోందని పాలక బీఆర్‌ఎస్ పార్టీ ఆరోపిస్తుంటే, ప్రైవేటీకరణ చేసే అవకాశం మా చేతుల్లోనే లేదని బీజేపీ ప్రభుత్వం ప్రత్యారోపణ చేస్తోంది. స్వయాన నరేంద్ర మోడీనే రామగుండం పర్యటన సందర్భంగా ఇలా ప్రకటించారు. అయితే, సింగరేణిలో తవ్వడానికి సిద్ధంగా ఉన్న 44 బొగ్గు బ్లాకులను గుర్తించగా, వాటిలో సింగరేణి సొంతంగా తవ్వగలిగే బావులు 27 వరకు ఉన్నాయి. ఇవి తెలంగాణ పరివాహక ప్రాంతాల్లో ఉన్నా, తవ్వే కేటాయింపులను కేంద్ర ప్రభుత్వమే కేటాయించాల్సి ఉంటుంది. వీటిలో నాలుగు బ్లాకులలో తవ్వకాలకు సింగరేణి దరఖాస్తు చేసుకోగా కేంద్రం వాటిలో ఒకదాన్ని ఇప్పటికే ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. తవ్వకాలలో రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉండే బీఆర్‌ఎస్ ప్రభుత్వం, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న విధంగా ప్రతి అంశాన్ని రాజకీయంగా వినియోగించుకోవడానికే చూస్తున్నది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి సంస్థ వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగానే ఉంది. ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకులను వేలంలో దక్కించుకొని బొగ్గు ఉత్పత్తికి పోటీపడే సింగరేణి తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి విషయంలో మాత్రం చూసిచూడనట్లుగా వ్యవహరిస్తోంది.
భూపాలపల్లి జెన్‌కో కోసం విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన బొగ్గు సేకరణకు టెండర్ దక్కించుకున్న జెన్‌కో బొగ్గు నిక్షేపాలను వెలికి తీసే పనిని ప్రైవేటు కంపెనీకి అప్పగించింది. ఇక్కడ బొగ్గు ఉత్పత్తి చేసేందుకు సింగరేణి ముందుకు రాలేదు. జెన్‌కో, సింగరేణి రెండూ తెలంగాణ ప్రభుత్వ కనుసన్నలోనే ఉండటం ఇక్కడ గమనార్హం. ఇటువంటి పరిణామాలను గమనిస్తే బొగ్గు తవ్వకం ప్రైవేటీకరణలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ తీరు కూడా బాగాలేదు. సింగరేణిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా, ప్రమాద సమయంలో హడావుడి చేసే ప్రభుత్వం.. కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. కేసీఆర్ ప్రభుత్వం మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేయాల్సిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (డిఎంఎఫ్) నిధులను ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ పోరాడుతుంది. ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాక కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల స్థానంలో శాశ్వత ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తుంది. డిపెండెంట్ ఉద్యోగాల విధానాన్ని సరళీకృతం చేసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. కేసీఆర్ కుటుంబాన్ని సింగరేణి నుంచి తరిమికొట్టే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని నేను ఆ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నాను.
కార్మికులలో గందరగోళం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రైవేటీకరణను రాష్ట్రంలోని బీఆర్‌ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు రాజకీయ అంశంగా వాడుకుంటూ కార్మికులలో గందరగోళం సృష్టిస్తున్నాయి. కరోనా సమయంలో విదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంగా సంస్కరణలు చేపడుతున్నట్లు ప్రకటించిన ప్రధాని మోడీ దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి భారీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పిలుపులో విదేశీ వ్యతిరేకత అంటూ దేశభక్తిని చాటుకుంటున్నట్లు నటిస్తూ సింగరేణి సంస్థను ప్రైవేట్ కాంట్రాక్టులకు అప్పగించేందుకు తెరదీశారు. ప్రస్తుతం తన స్వలాభం కోసం కేంద్రంతో తలపడుతున్నట్లు రోజుకో వివాదంతో కాలక్షేపం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఆ సమయంలో మోడీ ప్రభుత్వానికి అడుగులు మెత్తుతూ ఎలాంటి వ్యతిరేకతను తెలపకపోవడంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది.
దేశవ్యాప్తంగా 88 బొగ్గు బావుల ప్రైవేటీకరణలో భాగంగా సింగరేణిలో కూడా రాష్ట్రానికి చెందిన నాలుగు బొగ్గు బావులను ఆ జాబితాలో చేర్చారు. గత నవంబర్‌లో ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకున్నారే తప్ప రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఉభయులూ ఈ అంశాన్ని మసిపూసి మారేడుకాయలా చేస్తున్నారే కానీ రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని పట్టించుకోవడం లేదు.
–మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే, కాంగ్రెస్ సభా పక్ష నాయకులు