బోర్లాపడి బొక్కలిరిగినా బుద్ధి రాలే .. బీఆర్ఎస్​పై సీఎం రేవంత్​ ఫైర్​

బోర్లాపడి బొక్కలిరిగినా బుద్ధి రాలే .. బీఆర్ఎస్​పై సీఎం రేవంత్​ ఫైర్​
  • నెల రోజులైనా కాకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలా?
  • చెరకు తోటల్లో అడవి పందుల్లా రాష్ట్రాన్ని దోచుకున్నరు
  • లోక్​సభ ఎన్నికల్లో టార్గెట్ 17 సీట్లు.. కనీసం 12 గెలవాలి
  • కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గిందనే కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ అడుగుతున్నరు
  • నేను అడిగినప్పుడు ఎందుకు విచారణ చేయించలేదు?
  • బీజేపీ, బీఆర్ఎస్​ రెండు పార్టీలు కాళేశ్వరం పేరుతో దోచుకున్నయ్
  • పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కామెంట్లు
  • కాంగ్రెస్​ వచ్చాక స్వాతంత్ర్యం వచ్చిందని ప్రజలు ఫీలవుతున్నరు : భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు : బోర్లాపడి బొక్కలిరిగినా బీఆర్ఎస్​కు ఇంకా బుద్ధి రాలేదని పీసీసీ చీఫ్, సీఎం రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. నెల రోజులైనా కాకముందే కాంగ్రెస్​ హామీలపై పుస్తకాలను విడుదల చేస్తున్నారని, చెరకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆర్ఎస్​ నేతలు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్​ విమర్శలను దీటుగా తిప్పికొట్టాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. ప్రజలకు కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తమ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. 

బుధవారం గాంధీభవన్​లో నిర్వహించిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి రేవంత్​ మాట్లాడారు. లోక్​సభ ఎన్నికల్లో 17 సీట్లను టార్గెట్​గా పెట్టుకుని పనిచేయాలని, కనీసం12కు తగ్గకుండా గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 8న 5 జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ నెల10 నుంచి12 వరకు17 పార్లమెంట్ నియోజక వర్గాల ​ఇన్​చార్జీలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. 20 తర్వాత క్షేత్రస్థాయి పర్యటనల్లో పాల్గొంటానని తెలిపారు. 

కిషన్​రెడ్డి ఆదాయం తగ్గిందేమో..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదాయం తగ్గినట్టుందని, అందుకే కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ కోరుతున్నారని సీఎం రేవంత్​రెడ్డి ఎద్దేవా చేశారు. ఆనాడు తాను స్వయంగా సీబీఐ ఎంక్వైరీ కోరినప్పుడు ఏం చేశారని కిషన్​రెడ్డిని ఆయన ప్రశ్నించారు. దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్​ రెడ్డి అడుగుతున్నారంటూ ఫైర్​అయ్యారు. కాళేశ్వరం అక్రమాలపై జ్యుడీషియల్​ఎంక్వైరీ చేసి తీరుతామమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్​తోడుదొంగలన్నారు. ఆ రెండు పార్టీలూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నాయని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అన్యాయం చేశారని గుర్తు చేశారు. గ్రామస్థాయిలో ప్రజాపాలనలో పార్టీ శ్రేణులు భాగస్వాములు కావాలని రేవంత్​పిలుపునిచ్చారు. 

టీమ్​ వర్క్​తో పనిచేయాలి: దీపాదాస్​ మున్షి

రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు పదేండ్లు కష్టపడ్డారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్​ మున్షి అన్నారు. లోక్​సభ ఎన్నికల్లో టీమ్​వర్క్​తో పనిచేయాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్​ పార్టీ నెరవేర్చిందన్నారు. సోనియా గాంధీ జన్మదినం రోజున తెలంగాణ ఇస్తూ నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో బోగస్​ ఓట్లు చాలా ఉన్నాయని, ఈ విషయంలో నాయకులు శ్రద్ధ తీసుకుని పనిచేయాలన్నారు. మున్ముందు చాలా ఎన్నికలున్నాయన్నారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. 

కష్టానికి తగిన ఫలితం ఉంటుంది: ఉత్తమ్​

పార్టీ కోసం కార్యకర్తలు, నాయకులు ఎంతగానో శ్రమించారని, వారి త్యాగాల ఫలితంగానే కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిందని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారు. వారి కష్టానికి తగిన ఫలితం ఉంటుందని తెలిపారు. మరికొన్ని నెలలు కష్టపడితే లోక్​సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. జాతీయ స్థాయి ఎన్నికల్లో బీఆర్ఎస్​ బలహీనం అవుతుందన్నారు. కార్యకర్తల కష్టంతోనే ప్రభుత్వంలోకి వచ్చామని, వారి కష్టాల్లో పాలు పంచుకుంటూ సహకారం అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్​పార్టీ సభ్యులంతా ఒక్క కుటుంబంగా పని చేయాలని పిలుపునిచ్చారు.

ఆరున్నర కోట్ల మందికి ఫ్రీ బస్​జర్నీ: పొన్నం

ఫ్రీ బస్సు జర్నీతో ఆరున్నర కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం తెచ్చిన ఫ్రీ బస్​ జర్నీ విజయవంతమైందన్నారు. ఉచిత బస్సు జర్నీని బీఆర్ఎస్​పార్టీ రాజకీయాల కోసం వాడుకుంటున్నదని,  దాన్ని కాంగ్రెస్​ పార్టీ అన్ని స్థాయిల్లోనూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతంగా పనిచేశామని, లోక్​సభ ఎన్నికల్లోనూ అదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు.

నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్​సభ ఎన్నికల సన్నద్ధత, రాహుల్​ గాంధీ చేపడుతున్న ‘భారత్ న్యాయ్ యాత్ర’పై ఏఐసీసీ సమావేశం నిర్వహించనుంది. ఈ మీటింగ్​కు అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్​లు, సీఎల్పీ నేతలు హాజరవుతున్నారు. లోక్​సభ ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలు, చర్యలపై పీసీసీ చీఫ్​లు, సీఎల్పీ నేతలకు ఏఐసీసీ దిశా నిర్దేశం చేయనుంది. కాగా, ఏఐసీసీ సమావేశంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ రేవంత్ భేటీ కావొచ్చని సమాచారం.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందాం: భట్టి 

పదేండ్ల తర్వాత ప్రజలు కాంగ్రెస్​ పార్టీకి గొప్ప అవకాశం ఇచ్చారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో స్వాతంత్ర్యం వచ్చినట్టు ప్రజలు ఫీలవుతున్నారని తెలిపారు.  తెలంగాణ కోసం యువత ఎంతో పోరాటం చేసిందని, వారి కలలను నిజం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్​ కేడర్​పై ఉందన్నారు.

కాంగ్రెస్​ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, అభయహస్తం మేనిఫెస్టోను ప్రజలు నమ్మి కాంగ్రెస్​ను గెలిపించారని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్​ కేడర్​ప్రజలకు చేరువ చేయాలన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పిచేసి అప్పుల ఊబిలోకి నెట్టిందని తెలిపారు. రాష్ట్రాన్ని ఇప్పుడు ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్​ ప్రభుత్వంపై ఉందన్నారు. దాంతోపాటే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.