- వైరల్ అయిన వీడియో
- హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్వీఆర్కు ఎస్సై అటాచ్
- అవినీతి ఆరోపణలతో మరో హెచ్‌సీ, మరో ఆరుగురు కానిస్టేబుల్స్ బదిలీ
మహదేవపూర్, వెలుగు : భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఓ కాంగ్రెస్ లీడర్ డ్యాన్స్ చేస్తూ వీడియో తీసుకోవడం..సోషల్ మీడి యాలో వైరల్ కావడంతో ఎస్పీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయగా, ఎస్సైను వీఆర్‌కు అటాచ్ చేశారు. మహదేవపూర్ జడ్పీటీసీ గుడాల అరుణ భర్త శ్రీనివాస్ అరవై ఏండ్ల వయస్సుకు దగ్గరలో ఉన్నా వాకింగ్ చేస్తూ..ఎక్సర్ సైజుల్లో భాగంగా డ్యాన్స్ చేస్తూ చూసేవారిని ఉత్తేజపరుస్తూ ఉంటారు. పలు సందర్భాల్లో రోడ్లపై డ్యాన్సులు చేస్తూ వీడియోలు తీసి సోషల్‌మీడియోలో పోస్ట్ చేశారు.
సోమవారం వాకింగ్ కు వెళ్లిన ఆయన మహదేవపూర్ పీఎస్ కు వెళ్లి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్‌ను పలకరించారు. ఈ సందర్భంగా అక్కడి పోలీసులు శ్రీనివాస్ తో ‘మీరు డ్యాన్స్ బాగా చేస్తారు’ అని మెచ్చున్నారు. ఓ సినిమా పాట పెట్టగా గుడాల శ్రీనివాస్ డ్యాన్స్ చేయగా హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ వీడియో తీశాడు. తర్వాత ఆ వీడియోను గుడాల శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే బీఆర్‌ఎస్ లీడర్లు కొం దరు పోలీస్టేషన్‌ను క్లబ్‌గా మార్చారంటూ ఇదే వీడియోను వైరల్ చేశారు. దీంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వీడియో తీస్తూ ఎంకరేజ్ చేసిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేయగా, ఎస్ఐ ప్రసాద్‌ను వీఆర్ కు అటాచ్ చేస్తూ ఎస్పీ కిరణ్ ఖరే ఆర్డర్స్ఇష్యూ చేశారు.
అలాగే అవినీతి ఆరపోణలతో ఇదే పీఎస్‌కు చెందిన మరో ఆరుగురు కానిస్టేబుల్స్‌ను వివిధ పీఎస్‌లకు బదిలీ చేశారు. ఘటనపై గుడాల శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ఎక్సర్సైజ్లో భాగంగా డ్యాన్స్ చేయడం నా హాబీ. ఒత్తిడిలో ఉండే పోలీసులకు డ్యాన్స్‌తో ఎలా ఒత్తిడి దూరం చేసుకోవాలో చెప్పాను తప్పితే నాకు వేరే ఉద్దేశం లేదు. కొంతమంది గిట్టని వారు ఎలక్షన్ టైమ్ లో మండలంలో మా పార్టీని దెబ్బ కొట్టాలనే కుట్రతో నెగటివ్‌గా ప్రమోట్ చేశారు' అని అన్నారు.