ఆవిర్భావ వేడుకలపై రాద్ధాంతం ఎందుకు : గజ్జెల కాంతం

ఆవిర్భావ వేడుకలపై రాద్ధాంతం ఎందుకు : గజ్జెల కాంతం
  • బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం ఫైర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల పట్ల ఉద్యమకారులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం అన్నారు.  ఆవిర్భావం అంటే తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిన రోజని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే గడీల్లో బందీ అయిన తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందని చెప్పారు.  శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. 1969 నుంచి 2014 వరకు ఉద్యమం చేసి రాష్ర్ట ప్రజలు తెలంగాణను సాధించుకున్నారని గుర్తుచేశారు. 

కానీ పదేండ్లు కేసీఆర్ కబంధ హస్తాల్లో బందీ అయిందని తెలిపారు. ఉద్యమ సమయంలో కేసీఆర్.. ఏపీ వాళ్లు వద్దని, రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నుతానని చెప్పి అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయ్యారని విమర్శించారు. కేసీఆర్ చేసిన దొంగ దీక్ష వల్లే 1,200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఎప్పుడూ జైలుకు వెళ్లలేదని.. ఆయన కుటుంబ సభ్యులు చనిపోలేదని గుర్తు చేశారు.