- రాష్ట్ర బీజేపీ నేతలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సవాల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సవాల్ విసిరారు. సోమవారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కేంద్ర బడ్జెట్ ద్వారా తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం గుండు సున్నా ఇచ్చిందని ఎద్దేవా చేశారు.
ఈ మోసంపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్..కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నారని, కేసీఆర్ ను దారుణంగా తిట్టిన తలసానినీ బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేల రహస్య భేటీపై సందర్భం వచ్చినప్పుడు స్పందిస్తానని చెప్పారు.