- అలా చేయట్లేదని ఎవరైనా చెప్తే అది అబద్ధం: జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఇప్పుడున్న రాజకీయాల్లో ఏ పార్టీ నాయకుడైనా సరే, చివరకు తనతో పాటు అందరూ డబ్బులు తీసుకొనే రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. డబ్బులు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నామని ఏ నాయకుడైనా అంటే, ఈ విషయాన్ని తనతో పాటు ఎవ్వరూ ఒప్పుకోరన్నారు.
ఏ పార్టీ అయినా ప్రతీకార చర్యలకు దిగడం మంచిది కాదని పేర్కొన్నారు. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే అధికారం కోల్పోయిన తర్వాత బాధపడాల్సిందేనన్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య ఎవరు కూడా ప్రతీకార చర్యలకు దిగలేదని గుర్తుచేశారు. రాజకీయ యుద్ధం చేయాలి తప్ప ప్రతీకార చర్యలకు పాల్పడవద్దని, దీనికి తాను పూర్తిగా వ్యతిరేకమన్నారు.