దేశ ప్రజల కోసం మోదీ ఏనాడైనా జైలుకు పోయారా?: జగ్గారెడ్డి

దేశ ప్రజల కోసం మోదీ  ఏనాడైనా జైలుకు పోయారా?: జగ్గారెడ్డి

మోడీ మూడు సార్లు ప్రధానిగా గెలిచినా ఎన్నడూ జైలుకు పోలేదన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. దేశ ప్రజల మేలు కోసం కొన్ని గంటలైనా జైలు జీవితం గడిపారా? అని ప్రశ్నించారు. స్వాతంత్ర్య ఉద్యమం కోసం నెహ్రు 3259 రోజులు జైలు జీవితం గడిపారని అన్నారు.   నెహ్రు, ఇందిరా గాంధీ కుటుంబం దేశ ప్రజల భద్రత కోసం చంపబడ్డాయన్నారు.  మానవ జీవితం ఉన్నంత వరకు ఆ కుటుంబాన్ని మరిచిపోరని చెప్పారు.  ఉన్న ఆస్తులను ప్రజలకు ధారాదత్తం చేసిన చరిత్ర నెహ్రు కుటుంబానిది అయితే.. గవర్నమెంట్ క్వార్టర్ ను గుంజుకున్న చరిత్ర బీజేపీదని విమర్శించారు జగ్గారెడ్డి.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  పార్లమెంట్ లో నెహ్రు, ఇందిరా గాంధీల గురించి చెడుగా మాట్లాడటం బాధకరమన్నారు జగ్గారెడ్డి. రాష్ట్రపతి వ్యాఖ్యలని  కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. విలువలు లేని రాజకీయాలు చేయడం బిజెపి వాళ్లకు మంచి పద్ధతి కాదన్నారు.  ఆశ్రమంలో కూర్చొని కషాయం బట్టలు వేసుకొని ఎంపిలుగా గెలిచిన స్వాములు చరిత్ర  గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు జగ్గారెడ్డి. 

బ్రిటిష్ హయాంలో 200 ఏండ్లు రాచరిక పాలన నడిచిందన్నారు జగ్గారెడ్డి. నెహ్రు ప్రధాని అయ్యాక  డేమోక్రసీని తీసుకొచ్చారని చెప్పారు.  ఇందిరా గాంధీ ఉన్నప్పుడు కట్టించిన జాగా, ఇల్లు ఇంకా అందరికి గుర్తుంటదని చెప్పారు.  ఏ గ్రామం పోయినా 70 ఏండ్ల వయసు ఉన్న వాళ్ళు.. ఇది ఇందిరమ్మ ఇల్లు, జాగా అంటరు...ఈ విషయం  బిజెపి వాళ్ళు  తెలుసుకోవాలని సూచించారు జగ్గారెడ్డి.