
ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే హాజరుకానున్నారు. బీజేపీ పెద్దలు ఆయనకు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. విపక్ష నేతగా ఖర్గే ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ నేతలతో పాటుగా పలు రాష్ట్రాల సీఎంలు, ఆయా రాష్ట్రాల సీఎంలు, ప్రతిపక్ష నేతలు, పొరుగు దేశాధినేతలు హాజరు కానున్నారు. ఈ వేడుకకు సుమారుగా 7వేల మంది హాజరు కానున్నట్లు సమాచారం.
ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరగనున్న కార్యక్రమంలో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. పలువురు నేతలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న రెండో నేతగా మోదీ నిలిచారు.