- కాంగ్రెస్ టికెట్‌తో నామినేషన్ దాఖలు చేసిన కిషోరీ లాల్ శర్మ
- 40 ఏండ్లుగా రాయ్‌బరేలీ, అమేథీ పార్టీ బాధ్యతలు
అమేథీ(యూపీ): కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్న కిషోరీ లాల్ శర్మ యూపీలోని అమేథీ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి బరిలో దిగుతున్నారు. ఈమేరకు శుక్రవారం మధ్యాహ్నం స్థానిక నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. దీనికి ముందు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీ లోకల్ ఆఫీస్‌కు వెళ్లారు. కేఎల్ శర్మను భారీ మెజార్టీతో అమేథీ ఎంపీగా గెలిపించాలని అక్కడి నేతలు, కార్యకర్తలను కోరారు.
ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడారు. తాను ఎప్పటికీ అమేథీ ఓటర్ల వెంటే ఉంటానని స్పష్టం చేశారు. మళ్లీ ఈ నెల 6న అమేథీకి వస్తానని చెప్పారు. అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థుల కోసం కష్టపడి పని చేద్దామని పిలుపునిచ్చారు. 40 ఏండ్లుగా అమేథీ ప్రజలకు శర్మ సేవ చేస్తున్నారని, భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. కాగా, అమేథీలో బీజేపీ తరఫున కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బీఎస్పీ నుంచి నన్హే సింగ్ చౌహాన్ బరిలో ఉన్నారు.
1998లో చివరి సారిగా గాంధీయేతర వ్యక్తి పోటీ
గత 25 ఏండ్లలో నెహ్రూ, గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అమేథీ ఎన్నికల బరిలో కనిపించకపోవడం ఇదే తొలిసారి. 1998లో చివరిసారిగా గాంధీయేతర కుటుంబ సభ్యుడిని అమేథీ నుంచి పోటీకి దింపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెప్టెన్ సతీష్ శర్మ పోటీ చేశారు. అయితే.. బీజేపీ అభ్యర్థి సంజయ్ సిన్హా చేతిలో ఆయన ఓడిపోయారు. అంతకు ముందు 1996 ఎన్నికలలో శర్మ బీజేపీకి చెందిన రాజా మోహన్ సింగ్‌పై విజయం సాధించారు.
ఎవరీ కిషోరీ లాల్ శర్మ?
కిషోరీ లాల్ శర్మ, 1939 సెప్టెంబర్ 25న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 84 ఏండ్లు. పంజాబ్‌లోని లూధియానాకు చెందిన ఆయన.. 1987లో ఫస్ట్ టైమ్ అమేథీకి వచ్చారు. ఈయన గాంధీ, నెహ్రూ కుటుంబానికి చిరకాల విధేయుడు. 40 ఏండ్లుగా కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీకి సేవలందిస్తున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యాక.. గాంధీ ఫ్యామిలీకి కేఎల్ శర్మ మరింత దగ్గరయ్యారు.
అప్పటి నుంచి అమేథీకే పరిమితమై కాంగ్రెస్ కీలక నేతగా ఎదిగారు. 1999లో అమేథీ నుంచి ఫస్ట్ టైమ్ సోనియా గాంధీ పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలో కేఎల్ శర్మ కీలకంగా వ్యవహరించారు. తర్వాత అమేథీ స్థానాన్ని సోనియా గాంధీ.. రాహుల్‌కు కేటాయించారు. సోనియా ఏమో రాయ్‌బరేలీ షిఫ్ట్ అయ్యారు. దీంతో అమేథీ, రాయ్‌బరేలీ పార్టీ కార్యకలాపాలన్నీ కేఎల్ శర్మనే చూసుకుంటున్నారు.