- ప్రతిపక్షాలపై కిసాన్ కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి ఫైర్
హైదరాబాద్, వెలుగు: రుణమాఫీ నిబంధనలపై సీఎం రేవంత్రెడ్డి క్లారిటీ ఇచ్చినా కేటీఆర్, హరీశ్ రావు కావాలనే రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం పోయిందనే అక్కసుతో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన అభిప్రాయం ఉందన్నారు. రుణమాఫీ విధివిధానాలు అందరికీ తెలిసేవిధంగా జీవో 567ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ ఇతర పార్టీ కూడా ఆ తరహాలో రుణమాఫీ చేయలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు, రుణమాఫీలో అన్ని అవకతవకలే జరిగాయన్నారు.