కేటీఆర్​వి డైవర్షన్ పాలిటిక్స్ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేటీఆర్​వి డైవర్షన్ పాలిటిక్స్ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • ఫార్ములా-ఈ కేసు భయంతోనేఢిల్లీ టూర్
  • ‘అమృత్ టెండర్లపై విచారణకు మేం రెడీ.. కాళేశ్వరంపై విచారణకు మీరు రెడీనా?’ అని సవాల్  

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా-–ఈ కేసు భయంతోనే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని, ఈ కేసు నుంచి తప్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్​లో భాగమే కేటీఆర్ టూర్ అని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్​లోని తన నివాసంలో మీడియాతో వెంకట్ రెడ్డి మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ‘మోదీ లేడు.. బోడీ లేడు’ అని చెప్పిన కేటీఆర్​కు.. ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంపై కేటీఆర్ లో వచ్చిన మార్పు పెద్ద జోక్ అని అన్నారు.

పదేండ్లు అధికారంలో ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రమంత్రులను కలవడానికి చేతగాని కేటీఆర్.. కేసుల మాఫీ కోసం కొత్త నాటకానికి తెరతీసిండు. కేటీఆర్ ఫెమా, ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి రూపాయలను డాలర్లుగా మార్చి కన్సల్టెన్సీల కడుపు నింపిండు. హైదరాబాద్ పేరు చెప్పి అడ్డంగా దోపిడీకి తెరతీసిన దోపిడీరావు కేటీఆర్. ఆయన తెచ్చింది ఒరిజినల్ ఫార్ములా రేస్ కాదు.. అది పెద్ద డూప్లికేట్” అని అన్నారు.  అమృత్ -2.0 టెండర్లలో అవినీతి జరిగిందంటూ కేటీఆర్ మాట్లాడటం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని వెంకట్ రెడ్డి అన్నారు. 

సుజన్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డికి తోక చుట్టం. కానీ కల్వకుంట్ల కవితకు ఆయన దశాబ్దానికి పైగా బిజినెస్ పార్ట్​నర్. ఇరిగేషన్ టన్నెల్ పనులు చేసిందివారే. దీనికి కేటీఆర్ జవాబు చెప్పాలి. అమృత్ టెండర్లు మా ప్రభుత్వం వచ్చే వరకే పూర్తయ్యే దశలో ఉన్నాయి. తేజారాజుకు చెందిన గజా కన్ స్ట్రక్షన్​కు అమృత్ -1 టెండర్లు ఇచ్చిందెవరు.. కేటీఆర్ కాదా? ప్రతిమ శ్రీనివాసరావు కు అమృత్ -1 టెండర్లు ఇచ్చిందెవరు.. మెగా కంపెనీకి టెండర్లు ఇచ్చిందెవరు.. కేసీఆర్ కాదా? రూ. 21 వేల కోట్ల విలువైన కాళేశ్వరం పనులను హాస్పిటల్ నిర్వహించే ప్రతిమ శ్రీనివాస్ రావు కు ఎట్లిచ్చిన్రు? అమృత్ టెండర్లపై మేం విచారణకు రెడీ.. కాళేశ్వరంపై విచారణకు కేసీఆర్ రెడీనా?” అని సవాల్ విసిరారు.  

కలెక్టర్​పై దాడి బాధాకరం.. 

వికారాబాద్ కలెక్టర్​పై దాడి బాధాకరమని వెంకట్ రెడ్డి అన్నారు. ఆయనపై దాడి చేసింది బీఆర్ఎస్ కార్య కర్త సురేశ్ అని అధికార యంత్రాంగం గుర్తించిందని, ఈ దాడి బీఆర్ఎస్ మానసిక స్థితికి నిదర్శనమని మంత్రి మండిపడ్డారు.