కామారెడ్డి, కామారెడ్డిటౌన్, వెలుగు: కేసీఆర్ పాలనలో నిరుపేదలకు జరిగిన అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ నాయకుడు కొండల్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో కొండల్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. 3, 4 వార్డుల్లో స్థానికులతో కలిసి ఆయన చాయ్ పే చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయక నిరుద్యోగ యువతను కేసీఆర్ మోసం చేశారన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా నిర్మించలేదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరిగిందన్నారు. కామారెడ్డి ప్రజలు కేసీఆర్‌కు బాయ్ బాయ్ చెప్పనున్నారన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ.2,500తో పాటు, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. నోటిఫికేషన్లు ఇచ్చి పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల కరెంట్, రూ. 2 లక్షల రుణమాఫీ చేయనున్నామన్నారు. అనంతరం మోచి ( శ్రీ సంత్ రవిదాస్ సంఘర్ ) సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మోచి కులస్తుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అనంతరం అయ్యప్ప టెంపుల్లో నిర్వహించిన మండల పూజలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఏఐసీసీ ఇన్చార్జి రిజ్వాన్, డీసీసీ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌రావు, పండ్ల రాజు, గొనే శ్రీనివాస్, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.