ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ రాబందుల సమితిగా మారిందని, పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని ప్రజలను పట్టిపీడుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రచార కమిటీ చైర్మెన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అన్నారు. మంగళవారం ఖమ్మం వచ్చిన ముధుయాష్కీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వరరెడ్డి, ఆల్ ఇండియా ఎస్టీసెల్ ఉపాధ్యక్షుడు బెల్లయ్యనాయక్‌లతో కలిసి సంజీవరెడ్డిభవన్లో మాట్లాడారు. రైతుల సమస్యలు, వడ్ల కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజెపీ వైఖరిని నిరసిస్తూ మే 6న వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తున్నామని, దీనికి రాహుల్ గాంధీ వస్తున్నారన్నారు. సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు తరలిరావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హత్యలు, దోపిడీలు, కబ్జాలు చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ భూకబ్జాలకు పాల్పడుతూ ప్రశ్నించే వారిపై పోలీసులను అడ్డం పెట్టుకుని దాడులు చేయిస్తూ గుండాలా వ్యవహరిస్తున్నారన్నారు. ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుని, చివరి నిమిషంలో మీడియాకు వాంగ్మూలం ఇచ్చినా ఎటువంటి చర్యలు లేవని, అదే కర్ణాటకలో ఓ మంత్రిపై ఆరోపణలు వస్తే అతను మినిస్టర్ పదవికి రాజీనామా చేశారన్నారు. సీఎం కేసీఆర్ఈ రౌడీ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి అజయ్ మమత మెడికల్ కాలేజీ పేరుతో అసైన్డ్ భూములను కబ్జా చేశారన్నారు. ఆల్ ఇండియా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు బెల్లయ్యనాయక్ మాట్లాడుతూ మంత్రి అజయ్ ప్రతి కాంట్రాక్ట్‌లో వాటాలు తీసుకుంటూ ఇసుకదోపిడీకి పాల్పడుతున్నాడన్నారు. పేదల భూములు సాగు చేసుకుంటే ట్రెంచింగ్ కొట్టే అధికారులు..దమ్ముంటే మంత్రి అక్రమించుకున్న మమత కళాశాల ఆసైన్డ్భూమిలో ట్రెంచ్కొట్టాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాల్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ జావీద్, మిక్కిలినేని నరేందర్, వడ్డెబోయిన నర్సింహారావు, బొందయ్య పాల్గొన్నారు.