ఆస్పత్రి నిర్మాణానికి తట్టెడు మట్టి తీయలె : కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కొత్తపేట ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు పరిశీలించడానికి వెళ్లారు. అనంతరం హేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఛార్జిషీట్ విడుదల చేసిన తర్వాత.. హైదరాబాద్ చుట్టూ 3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణంలో ఉన్నాయని మంత్రి హరీష్ రావు ప్రకటించారని.. ఆ నిర్మాణం ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికే తాము కొత్తపేటకు ఫీల్డ్ విజిట్ కు వచ్చామని తెలిపారు. 

కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ను పూర్తిగా తొలగించారని, ఆస్పత్రి నిర్మాణం ఇంతవరకూ ప్రారంభం కాలేదని మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆస్పత్రి నిర్మాణానికి తట్టెడు మట్టి తీయలేదు కానీ..రూ.1200 కోట్లతో సెక్రటరియేట్ కట్టారని విమర్శించారు. ఇక జిల్లా కేంద్రాల్లో వంద పడకల ఆస్పత్రి, మండల కేంద్రాల్లో 30 పడకల ఆస్పత్రిని ప్రభుత్వం మరచిపోయిందన్నారు. కొత్త ఆస్పత్రి నిర్మాణం జరగలేదు, కొత్త రిక్రూట్ మెంట్ లేకుండా మెరుగైన వైద్యం ఎలా అందిస్తారని ప్రశ్నించారు. మెరుగైన వైద్యం కోసం బడ్జెట్ లో కనీసం 8 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 4 శాతం మించి నిధులను వైద్య శాఖకు బడ్జెట్ కేటాయించడం లేదని ఆరోపించారు. డబ్బున్న వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటారు..పేదల పరిస్థితి ఏంటని మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.