కేసీఆర్ ‘బీఆర్ఎస్’ ఏర్పాటుతో.. పార్టీ పేరులో తెలంగాణ అనే పదం లేకుండా చేశాడని కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ ను లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇవాళ మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం ఇడికుడలో నాగం జనార్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్రిటీష్ వాళ్లను పారదోలిన పార్టీ కాంగ్రెస్ అని.. రాజులు, నవాబుల చేతుల్లో ఉన్న భూమిని పేదలకు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. టీఆర్ఎస్ తప్పులను చూస్తూ బీజేపీ ఎందుకు కాపాడుతోందని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ డబుల్ బెడ్ రూం ఇండ్లు సహా ఏ వాగ్దానం కూడా నెరవేర్చలేదన్నారు. ఇందిరమ్మ హయాంలో పేదలకు చేసిన మేలు ఇప్పటికీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల జనం ఇబ్బందులు పడుతున్నారు. 370 ఆర్టికల్ రద్దు వల్ల ఏం జరిగింది? అని సూటిగా ప్రశ్నించారు.
అన్ని మతాల వారు కలిసి ఉండాలనే రాహుల్ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని నాగం తెలిపారు. మేం చేసిన పనులు, కట్టిన ప్రాజెక్టులు మావి కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రయోజనం శూన్యమని.. ఒక్క ఎకరా భూమికి కూడా నీరు అందలేదని మండిపడ్డారు. దీనిపై కేసీఆర్ సహా ఎవరితోనైనా నేను చర్చకు సిద్ధం అని సవాల్ చేశారు. మునుగోడు ఫ్లొరైడ్ కోసం వీళ్లు చేసింది శూన్యం అన్నారు.
పాల్వాయ్ గోవర్దన్ రెడ్డి ఈ ప్రాంతానికి చేసిన సేవలను గుర్తించి స్రవంతిని గెలిపించాలని కోరారు. మునుగోడులోని శివన్న గూడెం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారు? అని నాగం నిలదీశారు. ఇల్లుల్లు తిరిగి ప్రజలకు దండం పెట్టి కాంగ్రెస్ కు ఓటేయాలని అడుగుదాం అన్నారు. ప్రజలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ అన్నారు. SLBC టన్నెల్ లో 42 కిలోమీటర్లకుగానూ కాంగ్రెస్ హయంలో 39 కిలోమీటర్లు తవ్వారు. మీరు తవ్వింది కిలోమీటరన్నర కూడా లేదని నాగం జనార్ధన్ రెడ్డి బీజేపీపై ఫైర్ అయ్యారు.
‘చెర్లగూడెం’పై అపోహలు తొలగించడానికి నాగం వచ్చారు : స్రవంతి
చెర్లగూడెం(శివన్నగూడెం) ప్రాజెక్టుపై ప్రజలకున్న అపోహలు తొలగించడానికి నాగం వచ్చారని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తెలిపారు. ‘‘దిండి ప్రాజెక్టు నుంచి 30 ఏండ్లైనా ఇంకా ఇక్కడికి నీళ్లు రావు. చెర్లగూడెం నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదని స్రవంతి విమర్శించారు.