సొమ్మసిల్లి పడిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం.. హుటాహుటిన ఆస్పత్రికి..

సొమ్మసిల్లి పడిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం.. హుటాహుటిన ఆస్పత్రికి..

అహ్మదాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం అస్వస్థతకు లోనయ్యారు. అహ్మదాబాద్లో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ఆయన స్పృహ తప్పి పడిపోయారు. 79 ఏళ్ల వయసున్న ఆయనను హుటాహుటిన ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు.

మహాత్మా గాంధీ గడిపిన సబర్మతి ఆశ్రమానికి వెళ్లిన ఆయన.. ఆశ్రమం గ్రౌండ్లో నడుస్తున్న సమయంలో సొమ్మసిల్లి పడిపోయారు. కిందపడిపోయిన ఆయనను ఎంత లేపేందుకు ప్రయత్నించినా పైకి లేవకపోవడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు తెలిపారు.

గుజరాత్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయని, ఆయనకు వడదెబ్బ తగలడం వల్లే ఇలా సొమ్మసిల్లి పడిపోయారని వైద్యులు తెలిపారు. 40 డిగ్రీల సెల్సియస్ పైగానే అహ్మదాబాద్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

వృద్ధాప్యం మీద పడిన వాళ్లు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. తన తండ్రి క్షేమంగానే ఉన్నారని, వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చిదంబరం కుమారుడు కార్తీ పి చిదంబరం ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.