‘ప్రాణహిత’తో సరిపోయేది..కాళేశ్వరం ఎందుకు?

‘ప్రాణహిత’తో సరిపోయేది..కాళేశ్వరం ఎందుకు?

తెలంగాణ పచ్చగా ఉండాలంటే కచ్చితంగా గోదావరి నీటిని వాడుకోవాల్సిందే. అందుకే కాంగ్రెస్​ ప్రభుత్వం ‘జలయజ్ఞం’లో ఈ ప్రాంతంలోని 31 భారీ, మధ్య తరహా సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టింది. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్​.. రీ డిజైనింగ్​, రీ ఇంజనీరింగ్​ సాకుతో పాత ప్రాజెక్టులను పట్టించుకోలేదు.

సీఎం కేసీఆర్​కి తన పేరు చరిత్రలో నిలిచిపోవాలన్న తాపత్రయం తప్ప సాగునీటి రంగాన్ని బాగు చేయాలనే తపన లేదు. బీళ్లను సస్యశ్యామలం చేయాలనే ఆలోచన అసలే లేదు. పొలాలకు నీరిచ్చి పంటలను కాపాడాలనే ప్రేమ అంతకన్నా లేదు. ఆయనకు నిజంగా ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగు నీటిని అందించాలన్న లక్ష్యమే ఉంటే కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను ముందు పూర్తి చేసేవారు.  అలా చేస్తే కాంగ్రెస్​ పార్టీకి పేరొస్తుందన్న అసూయతో పక్కన పెట్టారు.

తెలంగాణ పచ్చగా ఉండాలనే గోదావరి నీటిని వాడుకోటానికి కాంగ్రెస్​ సర్కారు ‘జలయజ్ఞం’ చేసింది. 31 భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ పాత ప్రాజెక్టులను పట్టించుకోలేదు. బదులుగా కొత్త ప్రాజెక్టులను తెరపైకి తెచ్చారు. అంబేద్కర్​ పేరుతో నిర్మించ తలపెట్టిన ప్రాణహిత ప్రాజెక్టు ప్రాణం తీశారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దీని వల్ల తెలంగాణకు నష్టమే ఎక్కువ. కాంగ్రెస్​ సర్కారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆదిలాబాద్​ జిల్లా ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద చేపట్టింది. ఇది పూర్తైతే తెలంగాణలోని ఏడు జిల్లాల్లో దాదాపు 16.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేది. రూ.38500 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే రూ.11,000 కోట్ల వరకు ఖర్చు చేశాం.

రివర్స్​ పంపింగ్​తో ఆర్థికంగా భారం

మేడిగడ్డ వద్ద పెద్దఎత్తున ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి పంపులు ఏర్పాటు చేసి మేడిగడ్డ నుంచి అన్నారం వరకు, అక్కడి నుంచి సుందిళ్లకు, తర్వాత ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయటం లాంటి రివర్స్​ పంపింగ్​ సిస్టమ్ వల్ల తెలంగాణపై ఆర్థికంగా విపరీతమైన భారం పడుతోంది. దీనికి దాదాపు రూ.80,000 కోట్లకుపైగా వ్యయం అవుతుంది. మారిన అంచనాల ప్రకారం అది లక్ష కోట్లు కూడా దాటొచ్చని ఇంజనీర్లు అంటున్నారు. అంటే ఈ ఖర్చు ప్రాణహిత ప్రాజెక్టు కన్నా దాదాపు రూ.50,000–70,000 కోట్లు ఎక్కువ.

అలాగే, కింద వరకు పోయి తిరిగి పైకి తీసుకురావటం వల్ల ఏటా వేల మెగావాట్ల విద్యుత్​ భారం తప్పదు. వివిధ బ్యాంకుల నుంచి అప్పులు తేవటం వల్ల వాటికి ఏటా వడ్డీ భారం పడుతుంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును గనక తుమ్మిడిహెట్టి దగ్గర కట్టి ఉంటే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీరొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉండేవి. వీటికి తోడు దీన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఉంటే బాగుండేది. అప్పటికే రాష్ట్రం రూ.11,000 కోట్లు వెచ్చించి ఉన్నందున మనపై ఒక్క పైసా అదనపు భారం పడేది కాదు. పూర్తిగా కేంద్రమే పెట్టుకునేది.

ఎండమావిలాంటి ప్రాజెక్టును ప్రపోజ్​ చేశారు

మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్​రావు గతంలో ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో తాను, విద్యాసాగర్​రావు అప్పటి సీఎం రాజశేఖర్​రెడ్డిని కలిసి ఒప్పించామని చెప్పుకొచ్చారు. మరి, ఎండమావి లాంటి ప్రాజెక్టును వాళ్లిద్దరూ ఎందుకు ప్రతిపాదించారో చెప్పాలి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కట్టి 33 ఏళ్లయినా చివరి ఆయకట్టుకు ఇంకా నీరు అందటం లేదన్నది టీఆర్​ఎస్​ వాదన. అందుకే గోదావరిలో దేవాదుల కింద కంతనపల్లి ప్రాజెక్టును మంజూరు చేసి టెండర్లు పిలిచాం.

కానీ.. టీఆర్​ఎస్​ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును రద్దు చేసింది. ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఉంటే 280 మెగావాట్ల హైడల్​ పవర్​ ప్రాజెక్టు, ఎస్​ఆర్​ఎస్​పీ కింద ఆయకట్టు స్థిరీకరణ జరిగి ఉండేది. వరంగల్​తోపాటు అనేక ప్రాంతాలకు తాగునీటి సదుపాయం దక్కేది. మరి, ఆ ప్రాజెక్టును కూడా టీఆర్​ఎస్​ ఎందుకు రద్దు చేసిందో సరైన సమాధానం చెప్పలేకపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం ఒక సాగునీటి ప్రాజెక్టులా కాకుండా పర్యాటక కేంద్రంలా ప్రచారం చేస్తోంది.

అలాగే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు స్థలం మేడిగడ్డ వద్ద పంప్​హౌజ్​ను ప్రారంభించి మొత్తం ప్రాజెక్టు పూర్తైనట్లు ప్రచారం చేసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం 36 లక్షల ఎకరాలని చెబుతున్నారు. అసలు ఒక్క ఎకరాకైనా నీరు ఇచ్చారా?. మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిళ్ల, అక్కడి నుంచి ఎల్లంపల్లి వరకు ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయా?. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువలు, పంట కాలువలు, పూర్తి చేశారా?. ఇవేవీ చేయకుండా ప్రాజెక్టు ఎలా సఫలం అయినట్లు?

ఒక్క ఎకరానికీ నీళ్లివ్వలేదు

ఒక్క ఎకరాకు కూడా నీరు ఇచ్చేందుకు అనుబంధ జలాశయాలు గానీ, కాలువలు గానీ పూర్తి చేయకుండా ఈ ప్రారంభోత్సవాలు ఎందుకు? అలాగే 148 మీటర్ల వద్ద (తుమ్మిడిహెట్టి దగ్గర) బ్యారేజీ నిర్మాణం చేసి ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్​ జిల్లాకు సాగునీరు ఇస్తామన్న మాటలు ఎటు పోయాయి? 2014 నాటికే కాంగ్రెస్​ ప్రభుత్వం పెద్దఎత్తున నిర్మాణాలు చేపట్టి పనులు చాలా వరకు చేసిన ప్రాజెక్టులను ప్రస్తుత సర్కారు ఎందుకు పూర్తి చేయలేదు?  కేవలం రూ.8,000 కోట్లు ఖర్చు పెడితే 34 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? ఏటా సాగునీటి రంగానికి రూ.25,000 కోట్లు వ్యయం చేస్తామన్నారు. అందులో రూ.8,000 కోట్లు కేటాయిస్తే తెలంగాణలో లక్షలాది ఎకరాలకు నీరందేది కదా!. ఇవన్నీ కాదని కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఏమనుకోవాలి? వీటన్నింటినీ తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. రైతుల కోసం చిత్తశుద్ధితో పనిచేసేవారెవరో, పేరు కోసమే ఆరాటపడేవారెవరో అర్థం చేసుకోవాలి.

28 వేల కోట్లతో  పూర్తయ్యేది

కేసీఆర్​ సర్కారు ఈ ప్రాజెక్టులో మిగిలిన పనులను పూర్తి చేసుంటే ఈపాటికి ఆయకట్టు మొత్తం సాగులోకి వచ్చేది. మరో రూ.28,000 కోట్లు కేటాయిస్తే అది పూర్తయ్యేది. తద్వారా దేశంలోనే పెద్ద ప్రాజెక్టు తెలంగాణలో అందుబాటులోకి వచ్చేది. దాన్ని వదిలేసి కాళేశ్వరానికి అంతకు మించి నిధులు వెచ్చించారు. ప్రాణహితపై టీఆర్​ఎస్​ వాదనలు అర్థ రహితంగా ఉన్నాయి. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నుంచి 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని వాళ్లు అంటున్నారు. అక్కడ 152 మీటర్ల ఎత్తున నిర్మాణం పూర్తి చేస్తే మహారాష్ట్రలో కేవలం 1800 ఎకరాల భూమే ముంపునకు గురవుతుంది. ఒకవేళ ఆ రాష్ట్రం ఎంత భారీ నష్టపరిహారం అడిగినా (ఉదాహరణకు ఎకరానికి రూ.20 లక్షల చొప్పున డిమాండ్​ చేసుంటే) మొత్తం రూ.400 కోట్లు మించకపోయేది. ఈ విషయంలో మహారాష్ట్రను ఒప్పించటానికి కేసీఆర్​ గవర్నమెంట్ ప్రయత్నం చేయలేదు. కాళేశ్వరం పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఎత్తిపోతల పథకం మొదలుపెట్టారు.

ఆహా.. ఓహో అనటం కాదు… ఆలోచించాలి

దాదాపు రూ.లక్ష కోట్ల వ్యయంతో సొరంగాలు, భారీ పంపులు, పంప్​ హౌజ్​లు, పంపింగ్​ స్టేషన్ల నిర్మాణం చేసినప్పుడు కచ్చితంగా అది అద్భుతంగానే ఉంటుంది. కానీ.. మనం నిర్మించే ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రైతాంగానికి ఏ మేరకు మేలు జరుగుతుందో మేధావులు, కవులు, రచయితలు, లాయర్లు, విద్యావంతులు ఆలోచించాలి. రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని వినియోగించి చేపడుతున్న పనుల్లో ప్రజలకు జరుగుతున్న మేలు ఎంత? అని ఆలోచించేవారే దార్శనికులుగా మిగిలిపోతారు.

కేవలం నిర్మాణాలను చూసి మురిసిపోయి ఆహా, ఓహో అంటే అది చిన్న పిల్లోడి మనస్తత్వం కిందికే వస్తుంది. ఇంకా కొన్ని మౌలికాంశాలను తెలంగాణ ప్రజల దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది. ఎల్లంపల్లి బ్యారేజ్​ని ఐదేళ్ల క్రితమే కాంగ్రెస్​ ప్రభుత్వం పూర్తి చేసింది. దాన్ని ఇప్పుడు కేసీఆర్​ ప్రభుత్వం వినియోగించుకుంటోంది. కానీ.. ఆ ప్రాజెక్టును ఇంతవరకూ అధికారికంగా ప్రారంభించలేదు. అంతేకాకుండా అక్కడ నిర్మాణ సమయంలో కట్టిన పైలాన్​ను కూల్చేశారు.

                                      – పొన్నాల లక్ష్మయ్య, ఉమ్మడి ఆంధప్రదేశ్​ సాగునీటి శాఖ మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్