బండి సంజయ్ ఓట్లకోసమే దేవాలయాలను వాడుకుంటున్నారు తప్ప..వాటి అభివృద్ధికి చేసిందేమి లేదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం నుంచి నిర్వహించే పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈనెల 9 నుంచి 18వ తేదీ వరకు గంభీరావుపేట నుండి హుస్నాబాద్ కు వరకు పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించేందుకే కాంగ్రెస్ పాదయాత్ర చేపడుతోందని తెలిపారు.
రాష్ట్ర ఏర్పాటును బీజేపీ వ్యతిరేకించింది
అన్నదాతలు చనిపోతున్న బండి సంజయ్ కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటని పొన్నం మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటును బీజేపీ వ్యతిరేకించిందని..తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీకి లేదని చెప్పారు. తెలంగాణ డిఎన్ఏ ఉన్న నేతలెవరు ఆ పార్టీలో ఉండకూడదన్నారు. తెలంగాణ విభజన హామీలు అమలు చేయకుండా..8మండలాలను సీలేరులో కలిపారని విమర్శించారు. 2018 సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ లో బీజేపీకి 1700 ఓట్ల వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని..అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికే ఈటల బీజేపీలో చేరారని ఆరోపించారు.
గల్లీలో కుస్తీ..ఢిల్లీలో దోస్తీ
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 108 సీట్లలో డిపాజిట్ రాలేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీకి ఏదో బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనని..గల్లీలో కుస్తీ..ఢిల్లీలో దోస్తీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. గత ఎనిమిదేళ్లుగా అటు మోడీ, ఇటు కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలు మోసం చేస్తున్నారని..వీటిని ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.