ఎమ్మెల్సీ కవిత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుంది : పొన్నం ప్రభాకర్

లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అవినీతికి ఆరోపణలకు నైతికబాధ్యత వహించి పదవికి రాజీనామా చేయకుండా అరెస్ట్ చేసుకోమనడం విడ్డూరమన్నారు. మంత్రి గంగుల కమలాకర్ సీబీఐ, ఈడీ కేసులతో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల విషయంలో చిల్లరగా వ్యవహరిస్తున్నాయని పొన్నం ఆరోపించారు. ధరణి పోర్టల్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని..కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని తెలిపారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర సర్కార్ రైతు రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పారు. తరుగు పేరుతో ధాన్యంలో కోత విధిస్తుండడంతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. 

పోడు భూముల పంపిణీ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని పొన్నం డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని.. రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. నెదునూరి ప్రాజెక్ట్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందన్నారు. సిరిసిల్ల టెక్స్టైల్ పరిశ్రమ మూత పడుతున్నా..కేటీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.