ఫ్యాక్టరీలను తరలించడం వల్లే మహారాష్ట్రలో నిరుద్యోగం
మోదీపై మండిపడ్డ ప్రియాంక
ముంబై: మహారాష్ట్రకు రావాల్సిన ప్రాజెక్టులన్నీ ప్రధాని మోదీ గుజరాత్‌కు తరలించుకుపోయారని, అందుకే రాష్ట్ర యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఆదివారం గడ్చిరోలి జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని సమస్యలను పక్కదారి పట్టించేందుకు లాడ్కీ బహిన్ వంటి స్కీమ్‌లను మహాయుతి ప్రభుత్వం తెరమీదకు తెస్తోందని మండిపడ్డారు.
ఫాక్స్‌కాన్, ఎయిర్‌బస్ ప్రాజెక్టులను గుజరాత్‌కు తరలించడం వల్లే రాష్ట్ర యువత నిరుద్యోగులుగా మారిపోయారన్నారు. యువత కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నా ఉద్యోగాలు దొరకడం లేదన్నారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్ర యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఉద్యోగాలు భర్తీ చేయకపోవడమే ఇందుకు కారణమని ఆమె ఆరోపించారు. మీ జీవితాలు బాగుండాలనే ఉద్దేశంతో మహిళలు ఓటు వేయాలి.. కానీ, నెలకు రూ.1,500 ఇస్తారని ఓటేయొద్దన్నారు. ఎంవీఏ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పండే సోయాబీన్‌కు క్వింటాల్‌కు రూ.7,000 మద్దతు ధర ఇస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు.