- కొంతమంది ఇండస్ట్రియలిస్ట్‌ల కోసమే పని చేస్తున్నరని ఆరోపణ
- గిరిజనులను తొక్కేయడమే బీజేపీ లీడర్ల లక్ష్యమని విమర్శలు
- జార్ఖండ్ ఎన్నికల ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ నేత కామెంట్
చాయ్‌బాసా(జార్ఖండ్): ఆదివాసీ గిరిజనులకు చెందిన జల్, జంగిల్, జమీన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ లాక్కొని బడా పారిశ్రామికవేత్తలకు ఇచ్చేందుకు కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ తన పదేండ్ల పాలనలో దేశ సంపదను కొల్లగొట్టి 22 మందిని బిలియనీర్లను చేశారని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కోట్లాది మందిని లక్షాధికారులను చేస్తామన్నారు. జార్ఖండ్‌లోని చాయ్‌బాసాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘‘రాజ్యాంగం, ఆదివాసీ గిరిజనుల హక్కులను కాపాడేందుకు ఎన్డీఏ కూటమితో ఫైట్ చేస్తున్నాం.
14 నుంచి 15 మంది ఇండస్ట్రియలిస్ట్‌లకు గిరిజనుల సంపద కట్టబెట్టాలని మోదీ ప్లాన్ చేస్తున్నరు. ఆయన అదానీ, అంబానీ కోసమే పనిచేస్తారు. ఆయన పేదల వ్యతిరేకి. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రతి మహిళ అకౌంట్లో లక్ష రూపాయలు వేసి వాళ్లను లక్షాధికారులను చేస్తాం. దేశంలో ట్రైబల్ పాపులేషన్ 8 శాతం ఉంది. ఆదివాసీ గిరిజనులు ఉన్నత స్థాయికి చేరడం బీజేపీ నేతలకు ఇష్టంలేదు. తొక్కేయాలని చూస్తున్నరు. గిరిజన యువతను డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లుగా వాళ్లు చూడాలని అనుకోవడం లేదు’’అని తెలిపారు.
నిజాలు దాచిపెట్టి.. అబద్ధాలు టెలికాస్ట్ చేస్తున్నరు
దేశంలో మెజారిటీ మీడియా సంస్థలన్నీ మోదీ చేతుల్లోనే ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. నిజాలను దాచిపెట్టి.. అబద్ధాలను టెలికాస్ట్ చేస్తున్నాయని మండిపడ్డారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ట్రైబల్స్, ఓబీసీ, దళితులకు ఉపాధి కల్పిస్తాం. పంటలకు మద్ధతు ధర ఇచ్చి రైతులను ఆదుకుంటాం. ఉపాధి హామీ కింద రోజువారీ కూలిని రూ.250 నుంచి రూ.400కు పెంచుతాం. ఆశా, అంగన్వాడీ కార్యకర్తల గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామన్నారు. గిరిజన సీఎం అని హేమంత్ సోరెన్‌ను బీజేపీ జైల్లో పెట్టిందని రాహుల్ మండిపడ్డారు.
హేమంత్ సోరెన్ కచ్చితంగా బయటికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. తర్వాత గుమ్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ స్కీమ్‌ను క్లోజ్ చేస్తామన్నారు. ఆర్మీ జవాన్లపై మోదీ కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను మోదీ అపహాస్యం చేస్తున్నారన్నారు. జీఎస్టీలో మార్పులు తీసుకొస్తామని చెప్పారు. పేదలకు ఉపయోగపడే చాలా వస్తువులపై ట్యాక్స్ తగ్గిస్తామన్నారు.