రూ.10 వేల కోట్ల ఈఎల్ఐ స్కీమ్​ ఎక్కడ..? కేంద్రంపై రాహుల్​గాంధీ ఫైర్​

రూ.10 వేల కోట్ల ఈఎల్ఐ స్కీమ్​ ఎక్కడ..? కేంద్రంపై రాహుల్​గాంధీ ఫైర్​

న్యూఢిల్లీ: రూ. 10 వేల కోట్ల విలువైన ఎంప్లాయిమెంట్​లింక్డ్​ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) స్కీమ్​ ఎక్కడపోయిందని కేంద్ర సర్కారును కాంగ్రెస్ ఎంపీ, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ ప్రశ్నించారు. ఏడాది గడుస్తున్నా ఈ పథకం జాడలేదని, యువతకు ఉద్యోగాలివ్వలేదని పేర్కొన్నారు. ఈ స్కీమ్​ మోదీ మరో జుమ్లా(అబద్ధం) అని ఎద్దేవా చేశారు.

శుక్రవారం రాహుల్​గాంధీ ‘ఎక్స్’ వేదికగా ఈఎల్ఐ స్కీమ్‎పై కేంద్ర సర్కారును నిలదీశారు. ప్రధాని మోదీ ఏడాది కింద ఆర్భాటంగా ప్రకటించిన ఈఎల్ఐ స్కీమ్​కు అసలు నిర్వచనమే ఇవ్వలేదని ఆరోపించారు. మోదీ రోజుకో కొత్త స్లోగన్​ను సృష్టిస్తున్నారని, కానీ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని అన్నారు. దీంతో యువత ఉపాధిపై కేంద్ర సర్కారుకు ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థమవుతున్నదని అన్నారు. 

వ్యాపారవేత్తల సంపద పెంపుపైనే దృష్టి

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంకంటే.. వ్యాపారవేత్తల సంపద పెంపుపైనే మోదీ సర్కారు దృష్టిపెట్టిందని రాహుల్​గాంధీ విమర్శించారు. పెద్ద కార్పొరేట్ కంపెనీలపై మాత్రమే దృష్టి పెట్టడం, సమానత్వం లేని వ్యాపారాలను ప్రోత్సహించడం, ప్రొడక్షన్​కు బదులు అసెంబుల్డ్​పై ఆధారపడడం,  స్వదేశీ నైపుణ్యాలను పట్టించుకోకపోవడం వల్ల ఉపాధి సృష్టి సాధ్యం కావడంలేదని అన్నారు. 

అదానీ, ఇతర సంపన్న స్నేహితుల ఆస్తులను పెంచడంపైనుంచి దృష్టిని అట్టడుగు వర్గాల యువతకు సమాన ఉపాధి అవకాశాలు కల్పించడం వైపు ఎప్పుడు మళ్లిస్తారని మోదీని అడిగారు. కాగా, రాహుల్​గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాహుల్​గాంధీ తన అజ్ఞానాన్నే ఆయుధంగా మలుచుకుంటున్నారని విమర్శించింది. 2004–14 మధ్య కాంగ్రెస్​నేతృత్వంలోని యూపీఏ సర్కారు కేవలం 2.9 కోట్ల ఉద్యోగాలు మాత్రమే సృష్టిస్తే.. 2014–24 మధ్య మోదీ సర్కారు 17.19 కోట్ల ఉద్యోగాలు కల్పించిందని బీజేపీ నేత అమిత్​ మాలవీయ పేర్కొన్నారు.