కేవలం ఇద్దరు వ్యాపారస్తుల కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మోడీని పూజించే ఇద్దరికి మాత్రమే అన్ని వరాలు వస్తున్నాయన్నారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ప్రసిద్ధ మహాకాల్ శివుని ఆలయాన్ని రాహుల్ సందర్శించారు. ఎర్ర ధోతి ధరించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ గర్భగుడి ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. పేదల ఆస్తులను మోడీ ప్రభుత్వం.. బడా వ్యాపారులకు కట్టబెడుతోందని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా ప్రజలను ఏకం చేసేందుకు ఈ యాత్ర చేస్తున్నట్లు రాహుల్ చెప్పారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 380 కిలోమీటర్ల దూరం కొనసాగనుంది. నవంబర్ 23న మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలోకి ప్రవేశించిన రాహుల్ పాదయాత్ర రాష్ట్రంలో 12 రోజులపాటు కొనసాగనుంది. డిసెంబర్ 4న రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది.