రాయ్​బరేలీలో విశాక ఇండస్ట్రీస్​ 2 మెగావాట్ల .. సోలార్ రూఫ్ ప్లాంట్.. ప్రారంభించిన రాహుల్ గాంధీ

రాయ్​బరేలీలో విశాక ఇండస్ట్రీస్​ 2 మెగావాట్ల  .. సోలార్ రూఫ్ ప్లాంట్..  ప్రారంభించిన రాహుల్ గాంధీ
  • పర్యావరణ పరిరక్షణలో విశాక ఇండస్ట్రీస్ కృషి బాగున్నది
  • గ్రీన్ ఎనర్జీలో కీలక పాత్ర పోషిస్తున్నది
  • కర్బన ఉద్గారాలు తగ్గించడంలో విశాక ఉత్పత్తులు ఎంతో అవసరమని వ్యాఖ్య
  • కంపెనీ సేవలు వివరించిన చైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఎండీ సరోజా వివేక్

రాయ్​బరేలి(యూపీ):
పర్యావరణ పరిరక్షణకు విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎంతో కృషి చేస్తున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉత్తరప్రదేశ్ రాయ్​బరేలీ నియోజకవర్గంలోని కుండగంజలో విశాక ఇండస్ట్రీస్ ప్లాంట్​ను ఆయన మంగళవారం సందర్శించారు. 

ప్లాంట్​లో కాకా వెంకటస్వామి, రాజీవ్ గాంధీ, అంబేద్కర్ ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత, ఆటమ్ 2 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ పీవీ సోలార్ రూఫ్​ను ప్రారంభించారు. అదేవిధంగా, ఆటమ్ ఈ బైక్​లతో పాటు ఆటమ్ చార్జింగ్ స్టేషన్లను ఓపెనింగ్ చేశారు. ప్లాంట్​లో ఉన్న ఆటమ్ బైక్​ను పరిశీలించారు. బైక్ పనితీరును కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ స్వయంగా రాహుల్​కు వివరించారు. దేశవ్యాప్తంగా విశాక ఇండస్ట్రీస్ చేస్తున్న ఉత్పత్తులను రాహుల్​కు కంపెనీ ఎండీ సరోజా వివేక్ వివరించారు. 

అనంతరం.. పండ్లు, కూరగాయలు విక్రయిస్తూ పొట్ట నింపుకుంటున్న చిరు వ్యాపారులకు సోలార్ తోపుడు బండ్లను విశాక ఇండస్ట్రీస్ అందజేసింది. సోలార్ రూఫ్ ఉన్న ఈ తోపుడు బండ్లలో బ్యాటరీ, ఫ్యాన్, ట్యూబ్​లైట్, చార్జింగ్ ఫ్యాన్ సౌకర్యాలు  ఉంటాయి. సోలార్ తోపుడు బండ్ల తయారీ, వాటి ఉపయోగం గురించి రాహుల్​కు కంపెనీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి వివరించారు. ఈ సందర్భంగా విశాక ఇండస్ట్రీస్ తీసుకొస్తున్న పర్యావరణ అనుకూల ఆవిష్కరణలను రాహుల్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

 గ్రీన్ ఎనర్జీ రంగంలో ఇండియాను ముందుకు తీసుకెళ్లడంలో ఆటమ్​ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయని విశాక ఇండస్ట్రీస్​ను ప్రశంసించారు. చిరు వ్యాపారులకు సోలార్ తోపుడు బండ్లు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. గ్రామీణ అభివృద్ధితో పాటు కర్బన ఉద్గారాలు తగ్గించడంలోనూ విశాక ఉత్పత్తులు దేశానికి ఎంతో అవసరం అన్నారు. సుస్థిర భవిష్యత్తుకు రెన్యూవబుల్ ఎనర్జీ ఎంతో కీలకమని చెప్పారు. దేశవ్యాప్తంగా విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు.

ఇండియాలోనే అగ్రగామి సంస్థగా : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

గ్రీన్ ఎనర్జీకి అవసరమయ్యే ఉత్పత్తులను భవిష్యత్తులో మరిన్ని తీసుకొస్తామని కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గడ్డం వంశీ కృష్ణ అన్నారు. 2 మెగావాట్ల ఆటమ్ సోలార్ రూఫ్​​ ప్లాంట్ ప్రారంభం.. భవిష్యత్తు వైపు తమ ప్రయాణంలో ఒక కొత్త అధ్యయనాన్ని సూచిస్తుందని తెలిపారు. ఎనర్జీ ఇండిపెండెన్స్​, రూరల్​ డెవలప్​మెంట్ కు తోడ్పాటు అందించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. 

రాహుల్ గాంధీ చేతుల మీదుగా చార్జింగ్ స్టేషన్లు, సోలార్ రూఫ్ ప్లాంట్లు ప్రారంభించడం విశాక ఇండస్ట్రీస్​కు గౌరవంగా ఉందని తెలిపారు. ‘‘విశాక ఇండస్ట్రీస్ ఇండియాలోనే అగ్రగామి నిర్మాణ ఉత్పత్తుల సంస్థగా పేరు సొంతం చేసుకున్నది. కొత్త ఆవిష్కరణలు, నాణ్యతా ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కంపెనీ ముందుకు వెళ్తున్నది. విశాక ఇండస్ట్రీస్​​ ఆటమ్ సంస్థతో సోలార్ పవర్​ ఎలక్ట్రిక్​ మొబిలిటీ రంగంలో కీలకంగా ఎదుగుతున్నది. పర్యావరణానికి మేలు చేసే మరింత మెరుగైన ఉత్పత్తులు తీసుకొస్తాం. 

ఆటమ్ సోలార్ రూఫింగ్​తో హై ఎఫెషియెన్సీ ఎనర్జీ జనరేట్ చేయొచ్చు. ప్రత్యేకంగా సోలార్ ప్యానెల్ ఇన్​స్టాలేషన్ అవసరం కూడా ఉండదు’’అని వంశీకృష్ణ తెలిపారు. గంటకు 250 కిలో మీటర్ల వేగంతో గాలి వీచినా.. సోలార్ ప్యానెల్స్ తట్టుకుంటాయన్నారు. ఒక్కో ప్యానెల్ 1000 కిలోల మంచు బరువును కూడా మోయగలదని తెలిపారు. ఎలాంటి వాతావరణంలోనైనా అత్యుత్తమ సేవలు అందిస్తుందని వివరించారు. ఆటమ్.. ప్రపంచంలోని మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ సోలార్ రూఫ్ కోసం యూఎస్ పేటెంట్ ను పొందడంలో టెస్లాను అధిగమించిందన్నారు. దేశవ్యాప్తంగా 250కు పైగా ఆటమ్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.