రాహుల్ ప్రతిపక్షానికి ఫేస్ గా మారతారా?

రాహుల్ ప్రతిపక్షానికి ఫేస్ గా మారతారా?

కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​గాంధీ ఇప్పుడు ప్రతిపక్షానికి ఫేస్​ గా మారుతున్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేపడుతున్న ఆందోళనల్లో రాహుల్​ ముందుండి పాల్గొంటున్నారు. ప్రతిపక్ష నేతలందరినీ కలుపుకుని వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేదని కొంత కాలంగా జరుగుతున్న చర్చకు తాజా పరిణామాలతో చెక్​ పెట్టినట్లయ్యింది. రాహుల్ తన శైలిలో మార్పు, తన అడుగుల్లో కొత్తదనం ఉందని చూపిస్తున్నారు. రైతుల సమస్యను హైలైట్ చేయడానికి రాహుల్ పార్లమెంట్‌‌కు ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లారు. ఇక ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా సైకిల్‌‌పై వెళ్లి నిరసన తెలిపారు.

కొద్దిరోజుల క్రితం వరకూ ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ సోనియాగాంధీతో సమావేశం కావడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు రాహుల్​గాంధీ ఆ పాత్రను తీసుకుంటున్నారు. ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించేలా ముందుకు వెళుతున్నట్టుగా తన తాజా చర్యల ద్వారా సంకేతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం రాహుల్​లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష నాయకులతో సంబంధాలను ఏర్పరచుకుంటున్నారు. వారిని తరచుగా కలుస్తున్నారు. వారితో చర్చలు జరుపుతున్నారు. ఏదైనా విషయంపై వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు.

తరచుగా ప్రతిపక్షాలతో రాహుల్​ మీటింగ్స్

రాహుల్​గాంధీ తరచుగా ప్రతిపక్ష నాయకులతో మీటింగ్​లు పెడుతున్నారు. ఇటీవలే ప్రతిపక్ష నాయకులను బ్రేక్​ ఫాస్ట్​ మీటింగ్​కు పిలిచారు. తాజాగా సోమవారం మరోసారి వారందరితోనూ సమావేశం అయ్యారు. ఈ చర్యలన్నీ ప్రతిపక్షాల మధ్య ఐక్యత సాధించడంలో భాగంగా తీసుకుంటున్నవే. బ్రేక్​ ఫాస్ట్​ మీటింగ్​లో దాదాపు 15 పార్టీలు పాల్గొన్నాయి. కాంగ్రెస్​ కాకుండా.. డీఎంకే, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఎం, సీపీఐ, ఆర్ఎస్పీ, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్(ఎం), జేఎంఎం, నేషనల్​ కాన్ఫరెన్స్, తృణమూల్​ కాంగ్రెస్, ఎల్జేడీ మొదలైన పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ పరిణామాలు ప్రతిపక్ష కూటమి కాంగ్రెస్​ నేతృత్వంలోనే పనిచేయనున్నట్టు స్పష్టం చేస్తున్నాయి. ఈ తాజా మీటింగ్స్​కు బీఎస్పీ, ఆప్​ మాత్రం అటెండ్​ కాలేదు. ఎన్సీపీ నుంచి శరద్​పవార్, టీఎంసీ నుంచి మమతాబెనర్జీ, ఎస్పీ నుంచి అఖిలేశ్​ యాదవ్​ తో పాటు కీలక నేతలు హాజరయ్యారు. నేషనల్​ లెవల్​లో ప్రతిపక్షాల ఐక్యతకు సంకేతాలు కనిపిస్తున్నా.. బెంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​తో, ఉత్తరప్రదేశ్​లో సమాజ్​వాదీ పార్టీతో కాంగ్రెస్​ పొత్తు ఏర్పడటం లేదు. శరద్ పవార్, మమతా బెనర్జీ ప్రతిపక్షాల లీడర్​షిప్​ను టేకోవర్​ చేస్తారన్న మీడియా కథనాల నేపథ్యంలో ఈ డెవలప్​మెంట్​ ముందుకు రావడం ఆసక్తికరం. 

అందివస్తున్న  భావోద్వేగ అంశాలు

ప్రస్తుతం మోడీ ప్రభుత్వం కాంగ్రెస్​ పార్టీకి అనేక భావోద్వేగ అంశాలను అందించింది. మొదటగా రైతుల అంశం. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేపడుతున్నారు. దేశవ్యాప్తంగానూ నిరసనలు తెలుపుతున్నారు. ఇక నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల మరో అంశం. పప్పులు, నూనెలు, వంట గ్యాస్​ ఇలా అన్ని వస్తువుల ధరలు నింగిని తాకాయి. ధర పెరుగుదల తాకని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఈ పరిణామాలపై ప్రతి ఇంట్లోని మహిళలు నిరసన తెలుపుతున్నారు. ఇక పెట్రో ధరలు వంద రూపాయలు దాటడంతో ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే జనం భయపడుతున్నారు. ఇక డీజిల్​ ధరల పెంపు ప్రభావం నిత్యావసరాలు, ఇతర రవాణా వ్యవస్థపై పెనుభారం మోపుతోంది.

పెగాసస్​ తో సర్కారు ఉక్కిరిబిక్కిరి

పెగాసస్​​ స్కాండల్​తో జాతీయ భద్రత ప్రమాదంలో పడింది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, మాజీ ఎలక్షన్​ కమిషనర్​ అశోక్​ లావాసా, కాంగ్రెస్​ లీడర్​ రాహుల్​గాంధీ, ఎన్నికల స్ట్రాటజిస్ట్​ ప్రశాంత్​ కిశోర్ తో పాటు ఎంతో మంది జర్నలిస్టుల మొబైల్​ ఫోన్లు హ్యాక్​ అయ్యాయి. ఆర్మీ, రా కూడా హ్యాకర్ల లిస్ట్​లో ఉన్నట్టు తెలుస్తోంది. పెగాసస్​ స్కాండల్​ మోడీ సర్కారును ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలకు మంచి అవకాశాన్ని కల్పించింది. మోడీ ప్రభుత్వం ఈ స్పైవేర్​ను కొనుగోలు చేసిందా? దానిని ఎవరికి వ్యతిరేకంగా ఉపయోగించింది? అనే దానిపై మోడీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు డిమాండ్​ చేస్తున్నాయి. ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఈ ప్రశ్నలు మోడీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే, స్నూపింగ్​ అనేది అంత ప్రధానమైన సమస్య కాదన్నట్టుగా మోడీ ప్రభుత్వం కొట్టేస్తున్నా.. దానికి ఎలాంటి సమర్థనలు ఇవ్వలేకపోతోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం ఇస్తున్న వివరణలు ఎవరినీ సంతృప్తి పరచలేకపోయాయి. మోడీ–షా మ్యాజిక్​ తగ్గిపోతోందని ఇవన్నీ స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్​గాంధీ ప్రతిపక్షాలను లీడ్​ చేయడానికి ముందుకు రావడం రూలింగ్​ బీజేపీలో వార్నింగ్​ బెల్స్​ మోగిస్తోందని చెప్పవచ్చు.

వెంకట్ పరాస్,పొలిటికల్ ఎనలిస్ట్