తెలంగాణతో కాంగ్రెస్ పార్టీది పేగుబంధం. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అందించిన అపూర్వ విజయం స్ఫూర్తితో, భారతదేశ దశ - దిశ మార్చగలిగే చారిత్రాత్మక కార్యక్రమానికి తెలంగాణ గడ్డ, తుక్కుగూడ తెలంగాణ జనజాతర సభావేదిక నుంచి శ్రీకారం చుట్టాడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మోదీ ప్రభుత్వం అంటేనే ధనికుల కోసం, ధనికుల యొక్క, ధనికుల చేత నడపబడే ప్రభుత్వం. పదేండ్లుగా నిస్తేజితులైన మన దేశ ప్రజలకు, అట్టడుగు వర్గాలకు ఊపిరులు ఊదే బృహత్తరమైన ఎన్నికల శంఖారావానికి తెలంగాణ జన జాతర వేదిక అయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4,300 కి.మీల భారత్ జోడో పాదయాత్ర, మణిపూర్ నుంచి ముంబై వరకు 6,200 కి.మీల జోడో న్యాయ యాత్ర-2 లో భాగంగా విభిన్న ప్రాంతాల, జాతుల, వయసుల ప్రజానీకాన్ని నేరుగా కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. దేశంలో నేడు జరుగుతున్న బీజేపీ నిరంకుశ పరిపాలన నుంచి ఈ దేశాన్ని విముక్తి చేయాలని కంకణం కట్టుకున్నారు.
యువ న్యాయం
దేశవ్యాప్తంగా 10 ఏండ్ల మోదీ పాలనలో, రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో అత్యధికంగా మోసపోయింది యువతనే. అందుకని, చదువుకున్న యువతకు సంవత్సరానికి లక్ష రూపాయల శిక్షణాభివృద్ధి, రైట్ టు అప్రెంటిస్, కచ్చితమైన మొదటి ఉద్యోగం నియామకాల్లో భరోసా కల్పించడం. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖాళీలను భర్తీ చేస్తామని. 30 లక్షల కొత్త ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు ఈ దేశంలో అందిస్తామని. పేపర్ లీక్‌ల నుంచి విముక్తి కల్పిస్తామని, అందుకు పటిష్టమైన పరీక్షా విధానాన్ని కఠినమైన చట్టాలకు రూప కల్పన చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ ఇస్తున్నది.
భారతదేశ అప్పు1947–2014ల మధ్య రూ.55లక్షల కోట్లు ఉంటే పదేండ్ల మోదీ పాలనలో ఇపుడు రూ.153లక్షల కోట్లకు చేరింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ భారతదేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై ఆందోళన వ్యక్తం చేసింది. 30% గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు పొందలేక నిరుద్యోగులు అవుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్మేనిఫెస్టో రూపొందింది.
నారీ న్యాయం
మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ప్రతి ఏడాదికి లక్ష రూపాయలుసాయం చేయడం. కేంద్ర ప్రభుత్వం నియామకాల్లో 50% ఉద్యోగాలు మహిళలకు రిజర్వ్ చేయడం. ఆశావర్కర్లు మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కార్యకర్తలకు జీతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వ సహకారం రెట్టింపు చేయడం. మహిళలకు చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసేందుకు ప్రతి గ్రామంలో ఒక అధికార మైత్రి నియామకం చేపట్టడం. దేశంలోని మొదటి మహిళా టీచర్, సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే పేరిట హాస్టళ్లు ఏర్పాటు చేయడం. వర్కింగ్ ఉమెన్స్ కోసం హాస్టల్స్ రెట్టింపు చేయడం. కాంగ్రెస్ నారీ లోకానికి హామీలు ఇస్తున్నది.
శ్రామిక న్యాయం
స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో సోషలిస్ట్ ఎకానమీ పంథాను ఎంపికచేసుకుని అనేక ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం జరిబగింది. కానీ, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ద్వారా ఆదాయాలు సమకూర్చుకున్నాడు. దేశవ్యాప్తంగా శ్రామికులకు రోజువారి వేతనం కింద రూ.400లకు పెంచడం జరుగుతుంది. ఇది జాతీయ ఉపాధి హామీ కూలీలకు కూడా వర్తింపజేస్తూ కార్మికులకు సముచిత గౌరవం ఇవ్వాలని, కార్మిక లోకానికి ఆరోగ్య భద్రత కోసం, అసంఘటిత రంగంగా ఉన్న కార్మికులకు ఉచిత చికిత్స, ఆసుపత్రి, డాక్టర్, మందులు, పరీక్షలు, శస్త్ర చికిత్స సహా మరో 25 లక్షల హెల్త్ కవరేజ్‌ను కార్మికుల ఆరోగ్య భద్రత కోసం అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తున్నది.కేవలం గ్రామాలకే పరిమితమైన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించేటట్టు కొత్త చట్టాలు తీసుకురాబోతున్నాం. విదేశాల్లో అందిస్తున్నట్టుగా అసంఘటిత రంగంలో కార్మికులకు ప్రమాద, జీవిత బీమా సౌకర్యాన్ని ఏర్పాటు, కీలకమైన ప్రభుత్వ విధుల్లో కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను రద్దు, సైన్యంలో కాంట్రాక్టు పద్ధతిని ప్రోత్సహించే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తున్నది.
సామాజిక న్యాయం
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని తొలగించడం, సమానత్వం కోసం కుల గణన చేపట్టడం. తద్వారా ఏ వ్యక్తి సామాజిక వర్గం ఎంత శాతం జనాభా ఉన్నదో దాని ప్రకారం ఫలాలను పొందేటట్టుగా చట్టాలు రూపొందించడం, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల కోసం సబ్ ప్లాన్ తెస్తామని కాంగ్రెస్ దేశ ప్రజలకు హామీ ఇస్తున్నది.బీఆర్ఎస్ పార్టీ కనుచూపుమేరలో కూడా పోటీలో లేదు. ఈ పార్లమెంట్ ఎన్నికలు పదేండ్లు అధికారం చెలాయించిన మోదీకి, ఆయన మాయ మాటలకు మోసపోయిన ప్రజానీకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. తెలంగాణలో ప్రజాపాలనకు రెఫరెండంగా ప్రజలు అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని ఆశిస్తున్నాం.
రైతు న్యాయం
కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ‘రైతు సెంట్రిక్’ గా అనేక కార్యక్రమాలు అమలు జరిగాయి. కానీ, రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తానన్న మోదీ తన పదేండ్ల పాలనలో రైతులకు మిగిల్చింది కన్నీళ్లే. ఢిల్లీ పొలిమేరలో మద్దతు ధర కోసం రైతులు చేస్తున్న ఆందోళన యావత్ భారతదేశాన్ని కదిలించింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్వామినాథన్ కమిషన్ సూచనల మేరకు రైతులు పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర కల్పిస్తూ, కనీస మద్దతు ధర ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇస్తున్నది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో అప్పుల బారినపడిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఈ దుర్భర స్థితులలో, రైతు రుణమాఫీ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా రైతుల రుణమాఫీ కోసం రైతు కమిషన్ ఏర్పాటు చేయబోతున్నది. దీని పరిష్కారం కోసం పంట నష్టపోతే 30 రోజుల్లో బీమా సొమ్ము నేరుగా రైతు బ్యాంకు ఖాతాలోకి జమ చేసే విధంగా బీమా చెల్లింపు ప్రత్యక్ష బదిలీ పద్ధతిని అమలు చేస్తారు. వ్యవసాయ పనిముట్లకు, ఫెర్టిలైజర్స్‌కు, విత్తనాలకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు.
తెలంగాణ మేనిఫెస్టో
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన హామీలను కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచటం జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం (యూపీఏ-2) హయాంలో కేంద్రం పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) గత 10 ఏండ్లలో నిర్లక్ష్యానికి గురైంది. బీజేపీ పట్టించుకోలేదు. బీఆర్ఎస్ అడగలేదు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పునఃప్రారంభం చేస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు 2014లో బిల్లులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను బీజేపీ పూర్తిగా విస్మరించింది. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చట్టబద్ధమైన ఈ హక్కులను సాధించడానికి ఎన్నడూ పోరాటం చేయలేదు. ఈ హామీలో భాగంగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటు, హైదరాబాద్– విజయవాడ మధ్యన రాపిడ్ రైల్వే వ్యవస్థ నిర్మాణం, మైనింగ్ విశ్వవిద్యాలయ ఏర్పాటు లాంటి ప్రత్యేక హామీలు మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది.
పాలమూరుకు జాతీయ హోదా, ప్రతిష్టాత్మక పరిశోధన కేంద్రాలు
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెలంగాణకు ఇచ్చిన హామీ చాలా గొప్పది. దక్షిణ భారతదేశానికి నీతి ఆయోగ్ కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు, నూతన ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల సంఖ్య పెంపు, నవోదయ స్కూల్స్ సంఖ్య పెంపు, జాతీయ క్రీడా విశ్వవిద్యాలయ ఏర్పాటు, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ క్యాంపస్ ఏర్పాటు, నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు తదితరాంశాలు మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు జాతీయ హోదా, దక్షిణ భారతదేశానికి సంబంధించి సుప్రీంకోర్టు బెంచ్ ని హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని, రాజ్యాంగ సవరణ 73, 74వ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీ సర్పంచులకు నేరుగా అందిస్తామనేవి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ఇచ్చిన గొప్ప హామీలు. రాష్ట్రవ్యాప్తంగా ఇండస్ట్రియల్ కారిడార్లు ‘మేడ్ ఇన్ తెలంగాణ’ లక్ష్యంతో, పారిశ్రామిక అభివృద్ధిని వికేంద్రీకరించి, హైదరాబాద్‌కు సమీపంగా ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్స్, అలాగే ప్రధాన జాతీయ రహదారుల వెంబడి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ అండ్ ఇండస్ట్రీ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు దావోస్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ద్వారా రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు తెచ్చారు. హైదరాబాద్, -బెంగళూరు ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్- – నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్–-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్–-నల్గొండ– మిర్యాలగూడ ఇండస్ట్రియల్ కారిడార్, సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తాం. ఎగుమతి– దిగుమతులను ప్రోత్సహించేందుకు డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తాం. మేనిఫెస్టోలోని అంశాల ఆధారంగా, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధిని ప్రజలు గమనించాలి.
ఇంత పెద్ద ఎత్తున తెలంగాణకు కాంగ్రెస్ హామీలు ఇవ్వడం గొప్ప విషయం. అది పేగుబంధం. భారతదేశ ఆత్మతో పోలిన కాంగ్రెస్ మేనిఫెస్టోని ఆవిష్కరిస్తూ రాహుల్ గాంధీ నేను మీ ప్రాంతపు బిడ్డని ఎప్పుడు పిలిచినా వస్తా.. ఏ సహాయం కావాలన్నా చేస్తా అని గుండెలకు హత్తుకునే మాటలతో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న 5 న్యాయాలను తెలుగులో విడుదల చేశారు.
- డాక్టర్.
కొనగాల మహేష్ ,
అధికార ప్రతినిధి,
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ