- అప్పుడే రాజ్యాంగ రక్షణ సాధ్యం
- కులగణనతోనే అన్ని వర్గాలకు న్యాయం
- ఈ రెండింటి కోసం కొట్లాడతామని రాహుల్ గాంధీ హామీ
కొల్హాపూర్: రాజ్యాంగాన్ని రక్షించేందుకు రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాల్సిందేనని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇందుకోసం పార్లమెంట్ లో చట్ట సవరణ చేసేందుకు ఇండియా కూటమి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. దీన్ని ఏ శక్తి అడ్డుకోలేదని చెప్పారు. శనివారం మహారాష్ట్రలో రాహుల్ పర్యటించారు. కొల్హాపూర్ లో నిర్వహించిన ‘సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్’లో ఆయన మాట్లాడారు. దళితులు, ఇతర అణగారిన వర్గాల చరిత్రను స్కూళ్లలో బోధించడం లేదని.. చరిత్రను చెరిపేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
దేశంలో 90 శాతం మందికి అవకాశాలు దొరకడం లేదన్నారు. ‘‘మన దేశ బడ్జెట్ ను 90 మంది టాప్ ఐఏఎస్ ఆఫీసర్లు తయారు చేస్తారు. కానీ దేశంలో 50 శాతం ఉన్న ఓబీసీ కమ్యూనిటీ నుంచి వీరిలో ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇక 15 శాతమున్న దళితుల నుంచి ముగ్గురు, 8 శాతమున్న ఆదివాసీల నుంచి ఒక్కరే ఉన్నారు” అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిజాలన్నీ బయటకు వస్తాయనే కులగణనను బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. కులగణన కోసం పోరాడతామని తెలిపారు.
ఇప్పుడు శివాజీ ముందు తలవంచి ఏం లాభం?
బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. కొల్హాపూర్ లో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ‘‘ప్రజలను భయపెడుతూ, రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తూ.. శివాజీ మహరాజ్ ముందు తలవంచి నమస్కరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
మన దేశంలో రెండు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి సమానత్వం, ఐక్యత గురించి చెప్పే రాజ్యాంగం. ఇదే శివాజీ మహరాజ్ ఐడియాలజీ. ఇక మరొకటి ఆ రాజ్యాంగాన్ని నాశనం చేయాలనే సిద్ధాంతం. వాళ్లు (బీజేపీ) రోజూ పొద్దున్నే లేచి రాజ్యాంగాన్ని ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తుంటారు. రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తూ, ప్రజలను భయపెడుతూ ఉంటారు. మళ్లీ శివాజీ మహరాజ్ ముందు తలవంచి నమస్కరిస్తారు. శివాజీ మహరాజ్ సిద్ధాంతమైన రాజ్యాంగాన్ని రక్షించనప్పుడు.. ఆయన ముందు తలవంచి నమస్కరించి ఏం ప్రయోజనం” అని రాహుల్ ప్రశ్నించారు.