రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ వస్తున్నది.. బీఆర్ఎస్​ను, కేంద్రంలో బీజేపీని  ఓడిస్తం: రాహుల్ గాంధీ

  • కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు? 
  • ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తం  
  • తామొచ్చాక దేశంలో, రాష్ట్రంలో కుల గణన చేపడతామని హామీ 

పెద్దపల్లి/కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్ సునామీ వస్తోందని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ అన్నారు. ముందు తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించేందుకు, ఆ తర్వాత ఢిల్లీలో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ సునామీ రానుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య యుద్ధం జరుగుతోందని.. ఒకవైపు సీఎం కేసీఆర్‌‌‌‌, ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యమైన అధికారులు ఉంటే.. మరోవైపు ప్రజలు ఉన్నారని అన్నారు. గురువారం పెద్దపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో, కరీంనగర్ రాజీవ్ చౌక్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో రాహుల్ పాల్గొని మాట్లాడారు. దళితులను, గిరిజనులను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. 

డబుల్‌‌ బెడ్‌‌ రూమ్‌‌ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, రూ.లక్ష రుణమాఫీ.. ఇలా కేసీఆర్ ఎన్నో హామీలిచ్చి అమలు చేయలేదు. కానీ కాంగ్రెస్‌‌ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది. కర్నాటక, రాజస్థాన్‌‌, చత్తీస్‌‌గఢ్​‌లో ఉన్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాల పనితీరే ఇందుకు నిదర్శనం. తెలంగాణలో కూడా ఆరు గ్యారంటీలను అధికారంలోకి రాగానే మొదటి కేబినెట్‌ ‌మీటింగ్‌‌లోనే తొలి సంతకం చేసి అమలు చేస్తాం” అని హామీ ఇచ్చారు. రైతుబంధుతో కేవలం పెద్ద రైతులకే లాభం జరుగుతోందన్నారు. 

సింగరేణిని ప్రైవేట్ పరం కానివ్వం.. 

సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వబోమని రాహుల్ తెలిపారు. ‘‘గతంలోనూ సింగరేణి మైన్స్‌‌ను అదానీకి అప్పగించే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నం. గని కార్మికులకు అండగా ఉంటాం. ప్రభుత్వ బొగ్గు కంపెనీలకు, ప్రైవేటు బొగ్గు కంపెనీలకు వేర్వేరు ధరలను కేంద్రం నిర్ణయిస్తోంది. ఇది దారుణం. దాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం” అని చెప్పారు. ‘‘ప్రధాని మోదీ ఎక్కడికెళ్లినా తాను ఓబీసీనని చెప్పుకుంటారు. కానీ కేంద్రంలో కీలకమైన హోదాల్లో ఉన్న 90 మంది సెక్రటరీల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారు. దేశంలో ఎక్కువ శాతం ఓబీసీలున్నా, వారికి సంక్షేమ పథకాలు అందడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే దేశంలో, రాష్ట్రంలో కుల గణన చేపడతామని హామీ ఇచ్చారు. 

కేసీఆర్ పై ఎంక్వైరీ ఏదీ?  

కేసీఆర్ దోచుకున్నాడని ఆరోపణలు చేస్తున్న బీజేపీ.. ఆయనపై ఎందుకు ఎంక్వైరీ చేయించట్లేదని రాహుల్ ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ కేసులతో విపక్షాలను భయపెడుతున్న బీజేపీ.. కేసీఆర్ పై మాత్రం ఈడీ, సీబీఐ కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని నిలదీశారు. ‘‘నేను బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే నాపై 26 కేసులు పెట్టారు.  లోక్ సభ సభ్యత్వం కూడా రద్దు చేశారు. కానీ తెలంగాణలో రూ.లక్షల కోట్లు దోచుకున్న సీఎం కేసీఆర్‌‌పై మాత్రం ఎలాంటి కేసు పెట్టలేదు” అని అన్నారు. కేసీఆర్ దగ్గరికి సీబీఐ, ఈడీ ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్‌‌లో బీజేపీకి అండగా బీఆర్‌ఎస్‌ ‌ఎంపీలు ఉంటున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే దేశ సంపద అన్ని వర్గాలకు అందేలా కృషి చేస్తామన్నారు. 

ఆ మూడు పార్టీలు ఒక్కటే.. 

బీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ, ఎంఐఎం మూడూ ఒక్కటేనని రాహుల్ ఆరోపించారు. బీజేపీ, ఎంఐఎంకు ఓటు వేస్తే బీఆర్‌‌ఎస్‌‌కు వేసినట్టే అవుతుందన్నారు. అందుకే తెలంగాణలో బీఆర్‌‌ఎస్‌ ను, కేంద్రంలో బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం.. తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు.

కాగా, అంతకుముందు మంథని నియోజకవర్గంలో బస్సుయాత్రలో రాహుల్ పాల్గొని ప్రజలతో ముఖాముఖి  మాట్లాడారు. రామగిరి మండలంలోని ఓపెన్ కాస్టులో సింగరేణి కార్మికులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాహుల్ సభల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మధుయాష్కీగౌడ్, విజయ రమణారావు, కొత్త జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

తెలంగాణ రాకపోతే కేసీఆర్ కుటుంబం బిచ్చమెత్తుకునేది: రేవంత్ 

తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ప్రజలను నట్టేట ముంచిన కేసీఆర్.. మూడోసారి ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారు. ఉద్యోగాలు రాక ఆడ బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటే అవహేళన చేస్తున్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా వద్దనో, బిర్లా మందిర్ వద్దనో బిచ్చమెత్తుకునేది.

ఇయ్యాల లక్ష కోట్లు, వేలాది ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చాయో కేసీఆర్ చెప్పాలి. రాహుల్ గాంధీ ఎవరని అడుగుతున్న సన్నాసి కేటీఆర్... ఆ కుటుంబం చేసిన త్యాగమేంటో తెలుసుకోవాలి. గాంధీ కుటుంబానికి ఉండడానికి ఇళ్లు లేని పరిస్థితి ఉంటే.. పదేండ్లలో ఫామ్ హౌస్​లు కట్టుకున్న చరిత్ర మీది. తెలంగాణ రాకుంటే అమెరికాలో బాత్ రూమ్‌లు కడుక్కుని బతికేవాడివి” అని కేటీఆర్ ను విమర్శించారు. 

కేసీఆర్ రాజులా వ్యవహరిస్తున్నరు

తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌‌ పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా రైతులు, ప్రజలు, కార్మికుల కోసమే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారు. కానీ తెలంగాణ వచ్చి పదేండ్లయినా ఇక్కడి ప్రజల కలలను సీఎం కేసీఆర్ నెరవేర్చలేదు. కేసీఆర్ రాజులా వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ‌నిర్మించి రూ.లక్ష కోట్లు  దోచుకున్నారు. ప్రాజెక్టు పేరుతో పేదల భూములనూ గుంజుకున్నారు. కాళేశ్వరం వల్ల కాంట్రాక్టర్లు మాత్రమే బాగుపడ్డారు. పెద్దపల్లి జిల్లాకు చుక్క నీరు రాలేదు. ధరణి పోర్టల్‌‌ను తీసుకొచ్చి పేదల భూములను కేసీఆర్‌ ‌లాక్కున్నారు.

రాహుల్​ గాంధీ