రాహుల్ టూర్ ఖరారు.. అంతలోనే రద్దు

రాహుల్ టూర్ ఖరారు.. అంతలోనే రద్దు

హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన ఆకస్మికంగా రద్దయింది. మంగళవారం ఆయన టూర్ షెడ్యూల్ ఖరారై, అంతలోనే  రద్దవడంతో రాష్ట్ర నేతలు నిరుత్సాహానికి గురయ్యారు. మంగళవారం ఉదయం 10  గంటల ప్రాంతంలో రాహుల్ వరంగల్ వస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి సమాచారం అందింది. ఆయన మినట్ టూ మినట్ షెడ్యూల్ ఇటు పోలీసు అధికారులకు, అటు నేతలకు చేరింది. రాహుల్ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో 5.30 గంటలకు హన్మకొండకు చేరుకుంటారని తెలిపారు. 

అక్కడ ఓ ప్రైవేట్ హోటల్ లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాక సాయంత్రం 7. 30 గంటలకు కాజీపేట నుంచి చెన్నైకి ట్రైన్ లో వెళ్తూ  రైల్వేల ప్రైవేటీకరణపై తన జర్నీలో ప్రయాణికులతో రాహుల్ మాట్లాడ్తారని ఢిల్లీ నేతలు చెప్పారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో రాహుల్ గాంధీ ల్యాండ్ అయ్యే హెలికాప్టర్ కోసం యుద్ధప్రతిపాదికన అధికారులు హెలిప్యాడ్ కూడా సిద్ధం చేశారు. రాహుల్ టూర్ విషయం తెలిసి సీఎం రేవంత్ వద్దకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెళ్లి చర్చించారు. ఇంతలోనే మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో రాహుల్ టూర్ రద్దయినట్లు రాష్ట్ర నేతలకు సమాచారం అందింది.