పారిపోకండి.. ఉద్యోగాలివ్వండి.. బీహార్ ​సర్కారుకు రాహుల్ గాంధీ డిమాండ్​

పారిపోకండి.. ఉద్యోగాలివ్వండి.. బీహార్ ​సర్కారుకు రాహుల్ గాంధీ డిమాండ్​
  • వైట్ ​టీ షర్ట్​ యాత్రలో పాల్గొని, నిరుద్యోగులకు సందేశం
  • ఉద్యోగాలిచ్చేంతవరకూ సర్కారుపై ఒత్తిడి పెంచాలి
  • రాజ్యాంగం దేశ ఆత్మ అని వెల్లడి.. 
  • సామాజిక న్యాయం కోసం పోరాడాలని పిలుపు
  • కాంగ్రెస్‌‌‌‌ పార్టీకి మరో ఓటమి రాబోతోందని బీజేపీ ఎద్దేవా

న్యూఢిల్లీ: రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు ఏవని బిహార్​సర్కారును కాంగ్రెస్​అగ్రనేత, ఎంపీ రాహుల్​గాంధీ ప్రశ్నించారు. బిహార్​ నేతలు పారిపోవద్దని.. యువతకు జాబ్‎లు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. బిహార్‎లోని బెగుసరాయ్‎లో కాంగ్రెస్​ అనుబంధ సంస్థ ఎన్ఎస్‎యూఐ నేషనల్ ఇన్‌‌‌‌చార్జి కన్హయ్య కుమార్‌‌‌‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘‘పలాయన్​రోకో.. నౌకరీ దో”(పారిపోవద్దు.. ఉద్యోగాలివ్వండి)  ర్యాలీలో రాహుల్​ గాంధీ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అసత్య ప్రచారాలు, అబద్ధాలను నమ్మి మోసపోవడానికి మళ్లీ సిద్ధంగా లేరని, ఇకపై ప్రజలు మోసపోరని అన్నారు. 

తమ భవితవ్యాన్ని తామే రాసుకునేందుకు బిహార్‌‌‌‌ యువత సిద్ధంగా ఉన్నారని  చెప్పారు. ఈ కార్యక్రమానికి ముందు బిహార్​యువతను ఉద్దేశించి ఎక్స్‎లో రాహుల్​గాంధీ పోస్ట్​పెట్టారు. ‘‘బిహార్​యువత మీతో కలిసి సర్కారుతో పోరాడేందుకు నేను వస్తున్నాను. అందరూ వైట్​టీషర్ట్​ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొనండి. విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం ఆపండి. అందరం కలిసి రాష్ట్రంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రైవేటైజేషన్, పేపర్​లీక్​లాంటి సమస్యలపై పోరాడుదాం. మీతో భుజం కలిపి ముందుకు నడిచేందుకు నేను సిద్ధం” అని పేర్కొన్నారు. ఉద్యోగాలిచ్చేంతవరకూ సర్కారుపై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు.

రాహుల్ అడుగుపెడితే కాంగ్రెస్‎కు ఓటమే.. బీజేపీ సెటైర్​

 రాహుల్​గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ‘‘రాహుల్ గాంధీ బిహార్‎కు వచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్లినా.. ముందుగా తన కూటమికి, తన పార్టీకి సమస్యలు సృష్టిస్తారు. ఇక్కడ తేజస్వి యాదవ్‎కు సమస్యలు సృష్టించడానికి వచ్చారు. లాలూ జీ పార్టీ జంగిల్​రాజ్‎ను స్థాపించింది. బిహార్ ప్రజలు అవినీతిపరులను తిరస్కరించారు. వారు అభివృద్ధిని కోరుకుంటున్నారు” అని కేంద్ర మంత్రి నిత్యానంద్​రాయ్​అన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ మొత్తం కాంగ్రెస్ ఓడను ముంచేశారని, బిహార్‌‌‌‌లో కూడా అదే జరుగుతుందని, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్​ జైస్వాల్​ఎద్దేవా చేశారు.

రాజ్యాంగాన్ని కేంద్ర సర్కారు బలహీనపరుస్తున్నది

రాజ్యాంగాన్ని కేంద్రంలోని మోదీ సర్కారు బలహీనపరుస్తున్నదని రాహుల్​గాంధీ మండిపడ్డారు. పాట్నాలోని శ్రీ కృష్ణ మెమోరియల్ హాల్‌‌‌‌లో జరిగిన ‘సంవిధాన్ సురక్షా సమ్మేళన్’లో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగం దేశ ఆత్మ అని పేర్కొన్నారు. ఇది ప్రజల గౌరవం, ఆత్మగౌరవాన్ని రక్షిస్తుందని, అలాగే హక్కుల కోసం పోరాడే శక్తిని అందిస్తుందని చెప్పారు.

రాజ్యాంగం అంటే కేవలం ఒక బుక్​కాదని, ఇందులో అంబేద్కర్, గాంధీ, నెహ్రూ, గురు నానక్, కబీర్ వంటి మహానుభావుల ఆలోచనలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో బడుగు, బలహీన వర్గాలు రెండో తరగతి పౌరులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తితో సామాజిక న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రిజర్వేషన్ పరిమితులను సవాల్​ చేస్తున్నామని, కుల గణన ద్వారా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు.