వేముల రోహిత్​చట్టాన్ని చేయండి.. సీఎం రేవంత్​కు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ

వేముల రోహిత్​చట్టాన్ని చేయండి.. సీఎం రేవంత్​కు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ
  • యూనివర్సిటీల్లో కుల వివక్షను రూపుమాపండి
  • సీఎం రేవంత్​కు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ
  • నేటికీ లక్షలాది మంది అంటరానితనాన్ని
  • ఎదుర్కోవడం సిగ్గు చేటని వ్యాఖ్య
  • వేముల రోహిత్, పాయల్ తాడ్వీ, సోలంకీ మరణం తేలికగా తీసుకునే అంశం కాదన్న రాహుల్

న్యూఢిల్లీ, వెలుగు:అన్ని యూనివర్సిటీల్లో కుల వివక్ష నిర్మూలనకు వేముల రోహిత్ చట్టాన్ని అమలు చేయాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్​ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు.  యూనివర్సిటీల్లో కుల వివక్షను రూపుమాపాలని సూచించారు. ఈ మేరకు సీఎం రేవంత్​రెడ్డికి రాహుల్​గాంధీ సోమవారం రెండు పేజీల లేఖ రాసి, ఎక్స్​ వేదికగా విడుదల చేశారు.  2016 లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్​సీయూ)లో కుల వివక్షకు బలైన రోహిత్ వేముల పేరుతో చట్టం తెస్తామని  2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.  దేశంలోని విద్యాసంస్థల్లో నేటికీ లక్షలాది మంది దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు  అంటరానితనాన్ని ఎదుర్కోవడం సిగ్గు చేటని పేర్కొన్నారు. ఈ కుల వివక్ష కారణంగా రోహిత్ వేముల, పాయల్ తాడ్వీ, దర్శన్ సోలంకీలాంటి మంచి భవిష్యత్తు ఉన్న యువకులు అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించారని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రోహిత్ వేములతోపాటు లక్షలాది మంది ఎదుర్కొన్న వివక్షను.. ఇతరులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఈ చట్టాన్ని రూపొందించాలని సూచించారు.

లేఖలో అంబేద్కర్ ప్రస్తావన..​

సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో డాక్టర్​ బీఆర్​అంబేద్కర్​ ఎదుర్కొన్న కుల వివక్షతను రాహుల్​గాంధీ ప్రస్తావించారు. ‘‘అక్కడ పుష్కలంగా ఆహారం ఉంది. మాలో ఆకలి మండుతోంది. ఇవన్నీ ఉన్నప్పటికీ మేం ఆహారం లేకుండా నిద్రపోవాల్సి వచ్చింది. ఎందుకంటే మేం అంటరాన్నివాళ్లం కాబట్టి మాకు నీరు కూడా దొరకలేదు’’అని అంబేద్కర్​ రాతలను లేఖలో గుర్తు చేశారు.  మరో ఉదాహరణ ను వివరిస్తూ... ‘నేను అంటరానివాడినని నాకు తెలుసు. మేం ఇలాంటి వివక్ష కు గురవుతామనీ తెలుసు. స్కూల్​లో నా ర్యాంక్ ప్రకారం నా క్లాస్ మేట్స్ మధ్యలో కూర్చోలేనని, నేను ఒక మూలలో ఒంటరిగా కూర్చోవాలనీ నాకు తెలుసు’’ అని అంబేద్కర్​ చేసిన వ్యాఖ్యలను లేఖలో ప్రస్తావించారు. వివక్ష లేకుండా ప్రతి విద్యార్థికి గౌరవం, భద్రత, సమాన అవకాశం లభించకపోతే.. మన విద్యా వ్యవస్థ అందరికీ న్యాయం చేయలేదని రాహుల్ గాంధీ అన్నారు. విద్యాలయాల్లో అందరికీ సమాన అవకాశాలు, భద్రత, గౌరవం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని చెప్పారు. కుల వివక్షను అంతం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కాగా, ఇదే అంశంపై ఇటీవల కర్నాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్​ సుఖుకు సైతం రాహుల్ ​లేఖలు రాశారు.