రోడ్డు బాగు చేయాలని భర్తతో కలిసి కాంగ్రెస్ నేత ధర్నా

రోడ్డు గుంతలమయం అయినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ.. ఓ మహిళా కాంగ్రెస్ నేత తన భర్తతో కలిసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. రోడ్డుపై బైఠాయించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదకరంగా తయారైందని, ఇంటింటికి తిరుగుతూ.. బిక్షమెత్తి వచ్చిన డబ్బులతో గుంతలను పూడుస్తామన్నారు. మహిళా కాంగ్రెస్ నేత రేణుక భర్త శివతో కలిసి వినూత్నంగా నిరసనకు దిగారు. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అయ్యా,,, బంగారు తెలంగాణ అంటే ఇదేనా ? మీరు చేసిన అభివృద్ఢి’ అంటూ ప్ల కార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని కాంగ్రెస్ నేత రేణుక నిలదీశారు. రోడ్లపై ఉన్న దుమ్ముతో దుకాణదారులు, పాదాచారులు, వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక్కడి నుండి లారీల్లో ఇసుకను తీసుకెళుతున్నారే కానీ రోడ్డును బాగు చేయడం లేదని విమర్శించారు. ఓట్ల కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు.. ఇక్కడి రోడ్డు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని మానేరు వాగు ఇసుక ఎంతైనా తీసుకెళ్లండి.. కానీ.. ఇక్కడ రోడ్ల పరిస్ధితి ఏంటన్నారు.