బీజేపీలో చేరిన ఆర్‌పీఎన్ సింగ్

ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గరపడేకొద్దీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చిన ఆర్‌పీఎన్ సింగ్ బీజేపీలో చేరారు. తన రాజీనామాను ప్రకటించిన గంటల వ్యవధిలోనే కేంద్ర మంత్రి, యూపీ బీజేపీ ఇంఛార్జ్ ధర్మేంద్ర ప్రదాన్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్‌పీఎన్ సింగ్ కాంగ్రెస్ లో తాను 32ఏళ్లు ఉన్నానని, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ గతంలో మాదిరిగా లేదని అన్నారు. దేశం కోసం ప్రధాని మోడీ కన్న కలల్ని సాకారం చేసేందుకు బీజేపీలో కార్యకర్తలా పనిచేస్తానని అన్నారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మినిస్టర్ అమిత్ షా నాయకత్వంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని ఆర్పీఎన్ సింగ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
ఆర్పీఎన్ సింగ్ ను పద్రౌనా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని బేజీపీ యోచిస్తోంది. ఇటీవలే బీజేపీని వీడిన స్వామి ప్రసాద్ మౌర్యను సమాజ్ వాదీ పార్టీ ఇదే స్థానం నుంచి పోటీలో నిలిపింది. ఈ క్రమంలో మౌర్యకు చెక్ పెట్టేందుకు బీజేపీ ఆర్పీఎన్ ను రంగంలోకి దింపనుంది.