హామీలు నెరవేర్చకుండా..విద్వేషం పెంచుతున్నరు: శశిథరూర్

హామీలు నెరవేర్చకుండా..విద్వేషం పెంచుతున్నరు: శశిథరూర్
  •     మోదీపై కాంగ్రెస్ నేత శశిథరూర్ ఫైర్
  •     దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకుంటున్నరు
  •     అందుకే రామమందిర ప్రారంభానికి తాము వెళ్లలేదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు :  ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రధాని నరేంద్ర మోదీ విద్వేషం పెంచుతున్నారని కాంగ్రెస్  నేత శశిథరూర్  అన్నారు. గత పదేండ్లలో కేంద్రం ఏమిచ్చిందో గుర్తు చేసుకోవాలని ప్రజలను ఆయన కోరారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని, అలాంటప్పుడు ప్రజలు ఆ పార్టీకి  ఎందుకు ఓటేయాలని ఆయన ప్రశ్నించారు. విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప దేశానికి మోదీ చేసిందేమీ లేదని ఆయన ధ్వజమెత్తారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో మీడియా సమావేశంలో థరూర్  మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ లో మెజారిటీ  నాయకులు హిందువులే. మరి హిందువులం హిందువులను ఎందుకు ద్వేషిస్తాం? ద్వేషం అనేది కాంగ్రెస్ నాయకుల్లో ఉండనే ఉండదు. ద్వేషం అనే బజారులో  మేము ప్రేమ అనే దుకాణం తెరిచాం’’ అని ఆయన పేర్కొన్నారు. రామ మందిరాన్ని ఎన్నికల కోసం బీజేపీ నేతలు వాడుతున్న విధానాన్నే తాము తప్పుపట్టామని తెలిపారు. దేవుడిని రాజకీయం కోసం వాడుతున్నందుకే ఆలయ ప్రారంభోత్సవానికి తాము వెళ్లలేదని స్పష్టం చేశారు. ప్రజలను విడగొట్టడానికి బీజేపీ నేతలు  చాలా సార్లు మీడియాను కూడా వాడుకున్నారని ఆయన ఆరోపించారు. కాగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్  మంజూరు కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే ఆయన్ను అరెస్టు చేశారన్నారు.