హసీనా విషయంలో కేంద్రం చేసింది కరెక్టే : శశిథరూర్

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసింది కరెక్టేనని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. ఆమెకు సాయం చేయకపోతే అది భారత్ కే అవమానమని పేర్కొన్నారు. హింసాత్మక నిరసనల మధ్య బంగ్లాదేశ్ ప్రధాని పదవికి బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిన తర్వాత షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చినందుకు ఆయన కేంద్రాన్ని ప్రశంసించారు. సోమవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. "  షేక్ హసీనా భారతదేశానికి స్నేహితురాలు. ఆమెకు సహాయం చేయకపోతే అది భారతదేశానికి అవమానం అయ్యేది. మన స్నేహితుడితో మనం చెడుగా ప్రవర్తిస్తే ఎవరూ మనకు స్నేహితులు కావాలని కోరుకోరు. కేంద్రం చేసిన పనిని నేను ఒక భారతీయుడిగా అభినందిస్తున్నాను. 

ఆమె ఎంతకాలం ఉండాలనుకుంటున్నారనేది మనకు అనవసరం. ఎవరినైనా మన ఇంటికి ఆహ్వానిస్తే.. మీరు ఎప్పుడు వెళుతున్నారు అని అడగం. ఆమె ఎంతకాలం ఉంటారో వేచి చూద్దాం. ఆమె వ్యక్తిగత భద్రత ప్రమాదంలో ఉన్నప్పుడు అండగా నిలిచినందుకు గర్వపడాలి”అని థరూర్ అన్నారు. ఆ దేశంలో మైనారిటీలపై దాడుల గురించి ప్రస్తావించగా.. ‘‘దాడులు జరిగాయి, వాటిని ఎవరూ కాదనలేరు.. అదే సమయంలో బంగ్లాదేశ్ ముస్లింలు హిందూ గృహాలు, దేవాలయాలకు కాపలాగా ఉన్నారని కూడా కథనాలు వస్తున్నాయనడంలో సందేహం లేదు. అన్ని చెడు వార్తల సమయంలో కూడా ఒక మంచి వార్త వచ్చింది” అని ఆయన పేర్కొన్నారు.