తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : సోనియా గాంధీ

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : సోనియా గాంధీ
  •     రాష్ట్ర ఏర్పాటులో ప్రజల దృఢ సంకల్పం నాకు స్ఫూర్తినిచ్చింది
  •     ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణను ఏర్పాటు చేశాం
  •     రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
  •     సోనియాగాంధీ వీడియో సందేశం

న్యూఢిల్లీ, వెలుగు:  సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తుందని ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రజలకు సందేశాన్ని ఇస్తూ ఆదివారం ఆమె 2.12 నిమిషాల నిడివిగల వీడియోను సోషల్​ మీడియాలో పోస్ట్ చేశారు. ఆవిర్భావ వేడుకలకు అనివార్య కారణాల వల్ల ఆమె రాలేకపోయారు. 

సోనియాగాంధీ వీడియో సందేశాన్ని సికింద్రాబాద్​లోని పరేడ్ గ్రౌండ్స్ లో ప్రదర్శించారు. ‘‘తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. ప్రత్యేక తెలంగాణ కలను కాంగ్రెస్ పార్టీ సాకారం చేస్తుందని 2004లో కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో హామీ ఇచ్చాను. ఈ ప్రకటన తర్వాత సొంత పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. చాలా మంది మా పార్టీ వీడి వెళ్లిపోయారు, కానీ మీ ఓపిక, దృఢ సంకల్పం తెలంగాణ కలను సాకారం చేసేందుకు నాకు శక్తిని, ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చాయి’’ అని ఆమె పేర్కొన్నారు. గత పదేండ్లలో తెలంగాణ ప్రజలు తనకు ఎంతో గౌరవం, ప్రేమను పంచారని అన్నారు. 

‘‘సుభిక్షమైన, అభివృద్ధి చెందిన తెలంగాణను నిర్మించడానికి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అప్పగించిన కలలన్నీ నెరవేర్చడం మా కర్తవ్యంగా భావిస్తున్నాం” అని చెప్పారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీని నెరవేర్చడంలో వెనక్కి తగ్గదని ఈ శుభసందర్భంగా తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రగతి, ఉజ్వల భవిష్యత్తు కాంక్షిస్తున్నానని అన్నారు.