తెలంగాణకి ఐటీఐఆర్ ఇవ్వాల్సిందే : జగ్గారెడ్డి

తెలంగాణకి ఐటీఐఆర్ ఇవ్వాల్సిందే : జగ్గారెడ్డి
  • అప్పటిదాకా కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్​మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్ట్ మంజూరు చేసేదాకా కేంద్రాన్ని తాను ప్రశ్నిస్తూనే ఉంటానని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారు. ఈ విషయంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్​ను కలిసి వినతిపత్రం ఇస్తానన్నారు. బుధవారం గాంధీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి ఐటీఐఆర్ ఇస్తే, 2014 తర్వాత బీజేపీ ప్రభుత్వం దానిని రద్దు చేసిందని జగ్గారెడ్డి ఆరోపించారు. రద్దు చేయకపోయుంటే ఈ పదేండ్లలో 15 లక్షల ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చేవన్నారు.

ఐటీఐఆర్ పై ఎవరిమీద, ఎలాంటి విమర్శలు చేసే ఉద్దేశం తనకు లేదన్నారు. హైదరాబాద్ సిటీని ఆనుకొని ఉన్న నలుగురు ఎంపీలు బీజేపీవాళ్లేనని, ప్రజలు వాళ్లకు బాధ్యత ఇచ్చారు కాబట్టి ఐటీఐఆర్ గురించి అడుగుతున్నానని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యుంటే తామే ఐటీఐఆర్​ తెచ్చే వాళ్లమన్నారు. తాము ప్రతిపక్షంగా ఐటీఐఆర్ కావాలని అడుగుతున్నామని, మంజూరు చేయించి ఆ క్రెడిట్ మీరే తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని ఐదు రోజులకు ఒకసారి కేంద్రానికి గుర్తు చేస్తానన్నారు. ఐటీఐఆర్ గురించి తనకు అ, ఆ లు కూడా తెలియవనడంపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. తాను ఆర్ఎస్ఎస్ శాఖకు హాజరైనప్పుడు రఘునందన్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు