తెలంగాణలో బీఆర్ఎస్​ ప్రజాదరణ కోల్పోయింది : తీన్మార్​ మల్లన్న

గోదావరిఖని, వెలుగు : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌ బాధితులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ లీడర్‌ తీన్మార్ మల్లన్న హామీ ఇచ్చారు. మంగళవారం గోదావరిఖనిలో రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎస్ రాజ్ ఠాకూర్‌‌కు మద్దతుగా సినీనటుడు శివారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రజాదరణ కోల్పోతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని మల్లన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ ​కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్‌‌ అభ్యర్థి ఎంఎస్‌‌ రాజ్‌‌ఠాకూర్‌‌ మాట్లాడుతూ రామగుండం ప్రజలకు అండగా తాను ఉంటానని, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటానని తెలిపారు. సినీనటుడు శివారెడ్డి తన మిమిక్రీ ద్వారా ప్రజలను ఆకట్టుకున్నారు. అంతకుముందు అడ్డగుంటపల్లిలోని అబ్దుల్‌‌ కలామ్‌‌ విగ్రహం నుంచి కళ్యాణ్‌‌నగర్‌‌, లక్ష్మీనగర్‌‌ మీదుగా గాంధీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.