వచ్చే ఎన్నికల్లో వాళ్ల జన్మ ముగుస్తుంది: తుమ్మల నాగేశ్వర్ రావు

బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని ప్రజలను ఇబ్బందులు పెడితే వచ్చే ఎన్నికల్లో వారి జన్మ ముగుస్తుందని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మునిగేపల్లిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తుమ్మ పాల్గొన్నారు.  జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు  తనను ఒప్పించి  కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారన్నారు. తనకు వచ్చిన అవకాశాలతో ప్రజాహితం కోసం అభివృద్ధి కోసమే రాజకీయాలు చేశానని చెప్పారు. 

తన స్వార్ధం కోసం ఏనాడు రాజకీయాలు చేయలేదన్నారు తుమ్మల. మంత్రిగా పాలేరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తీర్చే అవకాశం శ్రీరామచంద్రుడు తనకు కల్పించారని చెప్పారు.సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ హయాంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు తుమ్మల. వాళ్ళ జాగీరు అనుకునే పరిపాలన వద్దని ప్రజాస్వామ్య హితంగా పాలించే  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు.

 రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో  గోదావరి నీళ్లు తీసుకొచ్చి పాలేరులో నింపుతానన్నారు తుమ్మల. ప్రజల ఆశలకు తగ్గట్టుగా వారికి అనుగుణంగా పనిచేశానని తెలిపారు. ప్రజల ఆనందంగా ఉండాలనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని.. తన శక్తి మేరకు కాంగ్రెస్ పార్టీని గెలిలించడానికి కృషి చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు