పాత కక్షలతో కాంగ్రెస్ నేత హత్య!

  • వీడుతున్న వడ్డే ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ  
  • డెడ్ బాడీని వైజాగ్ దగ్గర సముద్రంలో పడేసిన నిందితులు
  • పంచాది ఉందని ఏపీలోని జగ్గయ్యపేటకు పిలిపించి మర్డర్
  • సూర్యాపేట పోలీసుల అదుపులో ముగ్గురు 

సూర్యాపేట, వెలుగు: మాజీ నక్సలైట్, కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట మండల అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య మిస్సింగ్ కేసు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. పక్కా ప్లానింగ్ తో 10 రోజుల కింద ఎల్లయ్యను సూర్యాపేట నుంచి ఏపీలోని జగ్గయ్యపేటకు పిలిపించిన నిందితులు.. ఆయనను అక్కడే హత్య చేసి, మృతదేహాన్ని వైజాగ్ దగ్గర సముద్రంలో పడేసినట్టు సమాచారం. ఈ కేసులో ముగ్గురు నిందితులను సూర్యాపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మరికొంత మంది కోసం గాలిస్తున్నట్టు తెలుస్తున్నది. 

పంచాది ఉందని పిలిపించి..  

హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటకు చెందిన ఓ వ్యక్తి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఆ మహిళ అతనికి రూ.20 లక్షలు ఇచ్చింది. డబ్బులు తీసుకున్న తర్వాత ప్రియుడు ముఖం చాటేయడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ పంచాది సూర్యాపేట మండలం యర్కారం గ్రామానికి చెందిన వడ్డే ఎల్లయ్య వద్దకు వచ్చింది. అప్పటికే సెటిల్ మెంట్లు చేసే అలవాటు ఉన్న ఆయన.. ఈ పంచాది చేస్తానని చెప్పాడు. దీంతో ఎల్లయ్యకు రూ.5 లక్షలు ఇచ్చేందుకు ఆ మహిళ ఒప్పందం కుదుర్చుకుంది. ఎల్లయ్య సూర్యాపేటకు చెందిన ఓ వ్యాపారి కారు తీసుకొని ఈ నెల 18న సదరు మహిళతో కలిసి జగ్గయ్యపేటకు వెళ్లాడు. కానీ ఆ తర్వాత నుంచి ఆయన ఆచూకీ లేకుండాపోయింది. దీంతో ఎల్లయ్య భార్య ఎల్లమ్మ సూర్యాపేట, జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. ఆనాటి నుంచి రెండు రాష్ట్రాల పోలీసులు ఎల్లయ్య కోసం వెతుకుతున్నారు. 

స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడి హస్తం.. 

ఎల్లయ్య మిస్సింగ్ వెనుక ఏదో పెద్ద ప్లాన్ ఉందని సూర్యాపేట పోలీసులు అనుమానించారు. ఎక్కడో హైదరాబాద్ లో ఉండే మహిళ సూర్యాపేటలో ఉన్న ఎల్లయ్యను వెతుక్కుంటూ వచ్చి సెటిల్ మెంట్ చేయాలని కోరడం.. జగ్గయ్యపేటలో ఉన్న వ్యక్తి డబ్బులు ఇస్తానని చెప్పి, ఒక్కడివే రావాలని ఎల్లయ్యను కోరడం వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్టు తెలుస్తున్నది. ఎల్లయ్యను హత్య చేయడానికే ఓ ఫేక్ పంచాదిని సృష్టించి ప్రత్యర్థులు కథ నడిపించినట్టు ప్రచారం జరుగుతున్నది. 

ఎల్లయ్య మిస్సింగ్ వెనుక సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడితో పాటు మరికొంత మంది వ్యక్తులు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సైతం వారిని అదుపులోకి తీసుకుని సీక్రెట్ గా విచారిస్తున్నట్టు తెలిసింది. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడితో ఎల్లయ్యకు పాత గొడవలు, ల్యాండ్ సెటిల్ మెంట్ విషయంలో వివాదాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే హత్యకు ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. 

డెడ్ బాడీ కోసం గాలింపు.. 

ఈ నెల 18న జగ్గయ్యపేటకు కారులో బయలుదేరిన ఎల్లయ్య.. ఆ రోజు నుంచి కనిపించకుండా పోయాడు. అయితే ఎల్లయ్య వెళ్లిన కారు మాత్రం ఈ నెల 25న జగ్గయ్యపేట దగ్గర్లో పెనుగంచిప్రోలు గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో లభ్యమైంది. కానీ ఎల్లయ్య ఆచూకీ లభించలేదు. అయితే ఆయనను జగ్గయ్యపేటలోని ఓ లాడ్జీకి తీసుకెళ్లి అక్కడే హత్య చేశారని, ఆ తర్వాత ఫిషరీస్ లారీలో డెడ్ బాడీని తీసుకెళ్లి విశాఖపట్నం దగ్గర సముద్రంలో పడేశారని తెలిసింది. 

ఈ ఘటనలో మహిళ ప్రియుడే ప్రధాన పాత్ర పోషించినట్టు తెలుస్తున్నది. సూర్యాపేటలోని తిరుమలగిరికి చెందిన వ్యక్తి ప్రొద్బలంతోనే అతడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. ప్రస్తుతం వీళ్లిద్దరితో పాటు మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నాలుగు బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టిన పోలీసులు.. మరికొంత మంది కోసం వెతుకుతున్నారు. మరోవైపు ఎల్లయ్య మృతదేహం కోసం సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన డెడ్ బాడీ దొరికితేనే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.