న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత వేణుగోపాలాచారికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పోలీస్ కానిస్టేబుల్ పై దాడి కేసులో స్టే పొడిగించింది. 2002లో తునికాకు ఏరుకునేందుకు ఆదిలాబాద్ అడవిలోకి వెళ్లొద్దని స్థానికులను పోలీస్ శాఖ హెచ్చరించింది. ఈ విషయాన్ని వారు అప్పుడు ఎంపీగా చారి దృష్టికి తీసుకెళ్లారు. ఆ టైంలో హరీశ్ చంద్ర అనే కానిస్టేబుల్ రౌండ్ కు రాగా.. స్థానికులతో వాగ్వాదం జరిగింది.
ఈ సందర్బంగా ఎంపీ వేణుగోపాల చారి తనపై దాడి చేశారని హరీశ్ చంద్ర కేసు పెట్టారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు వేణుగోపాల చారికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.500 జరిమానా విదించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వేణుగోపాల చారి హైకోర్టును ఆశ్రయించగా.. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై బెంచ్ స్టే విధించింది. ఈ స్టే ఇటీవల ముగియడంతో.. రెండు నెలల క్రితం వేణుగోపాల చారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తో కూడిన బెంచ్ విచారించింది.