- తొక్కిసలాటఘటనను అనుకూలంగా మార్చుకునేందుకు యత్నం
- సీఎం రేవంత్ పైకేంద్ర మంత్రుల ఆరోపణలు గర్హనీయం
- కాంగ్రెస్నేత విజయశాంతి
హైదరాబాద్: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సినీ నటి, కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ట్విట్టర్వేదికగా స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. సినిమా ఇండస్ట్రీని నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోపణ చేయడం గర్హనీయమని ఫైర్ అయ్యారు. ‘ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్ట ఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య విభజన రేఖలు తెచ్చేలా కనిపిస్తోంది.
ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందాం అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అట్లా కాక మల్లా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఒక సంఘటనను బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ అంశంపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నేతల ప్రకటనల్లో ఇది కనిపిస్తోంది. సినీ పరిశ్రమకు అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావాలి. ఇలాంటివి జరగకుండా సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాలి’ అని పేర్కొన్నారు.