టీఆర్ఎస్, ఎంఐఎం సయామీ ట్విన్స్

టీఆర్ఎస్, ఎంఐఎం సయామీ ట్విన్స్
టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు సయామీ ట్విన్స్ అని అన్నారు కాంగ్రెస్ నేత విజయశాంతి. జీహెచ్ఎంసీ ఎన్నికలయ్యాక టీఆర్ఎస్ -ఎంఐఎంలు అవసరమైతే పొత్తు పెట్టుకుంటాయన్నారు. అవసరం లేకున్నా కలిసే ఉంటాయని.. ఆ రెండూ పార్టీలూ వీడదీయలేని సయామీ ట్విన్స్  అన్నారు . టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెండు నెలల్లో కూల్చేస్తామన్న ఎంఐఎం ఎమ్మెల్యే వ్యాఖ్యలు పూర్తిగా టీఆర్ఎస్ – ఎంఐఎంల మ్యాచ్ ఫిక్సింగ్‌తో ఓటర్లను మోసం చేసే కుట్ర జరుగుతుందన్నారు. ఎంఐఎం ఏడుగురి ఎమ్మెల్ల్యేలతో ప్రభుత్వం కూలదు .. అంటే ఎంఐఎం మతకలహాలు సృష్టించి ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెబుతున్నట్టా? అని ప్రశ్నించారు.  బీహార్ ఎన్నికల్లో ఎంఐఎంకు  టీఆర్ఎస్ భారీగా డబ్బులు అందించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుందన్నారు.
బీహార్‌లో టీఆర్ఎస్ ఎంఐఎం కలిసి ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిని ఓడగొడితే దేశవ్యాప్తంగా ఉన్న మైనార్టీలు ఇక కాంగ్రెస్ గెలవదన్న అభిప్రాయానికి వస్తారని.. తద్వారా రాష్ట్రాల్లో పట్టు ఏర్పరుచుకుని,  దేశమంతా వ్యాప్తి చెందాలనే ప్రయత్నం చేశారన్నారు. అయితే ఆ ఫలితాల వల్ల తెలంగాణలోని మొత్తం మైనార్టీలు టీఆర్ఎస్ – ఎంఐఎంలకు కూడా దూరమయ్యే దిశగా చర్చిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయన్నారు. ఆ ప్రమాదం నుంచి బయటపడేందుకు టీఆర్ఎస్ అధినేత ఎంఐఎంతో కలసి చర్చించారన్నారు. మళ్లీ మైనార్టీల నమ్మకం పొందగలిగే ఎత్తుగడలో భాగంగా దేశవ్యాప్త నేతలతో సమావేశాలు, మోడీపై యుద్ధం లాంటి నిష్ఫలమైన ప్రసంగాలు చేస్తున్నారన్నారు.  గతంలో వీరి ఫెడరల్ ఫ్రంట్ విన్యాసాలు అందరూ చూసినవేనని ఎద్దేవా చేశారు.