
- ఎంపీ కృషితో పెన్షన్ నిధికి రూ.140 కోట్ల నిధులు
- మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, రిటైర్డ్ కార్మికుల సంబురాలు
కోల్ బెల్ట్/బెల్లంపల్లి/నస్పూర్/చెన్నూరు, వెలుగు:పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి ఫలితంగా సింగరేణి కంపెనీ టన్ను బొగ్గుకు రూ.20 చొప్పున పెన్షన్ఫండ్ జమచేసేందుకు నిర్ణయం తీసుకుందని రిటైర్డ్ కార్మికులు, కాంగ్రెస్ లీడర్లు పేర్కొన్నారు. దీని ద్వారా పెన్షన్నిధికి రూ.140 కోట్ల నిధులు చేరుతాయన్నారు. రిటైర్డ్ కార్మికుల సంక్షేమానికి ఎంపీ చేస్తున్న కృషి పట్ల హర్షం వ్యక్తం చూస్తే కాంగ్రెస్, అనుబంధ సంఘాలు,రిటైర్డ్ కార్మికుల ఆధ్వర్యంలో శనివారం రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి, చెన్నూరు, నస్పూర్ ప్రాంతాల్లో ఎంపీ వంశీకృష్ణ ఫొటోలకు క్షీరాభిషేకాలు చేశారు.
ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ స్కీమ్‌ను ప్రారంభించారని తెలిపారు. కానీ గత 35 ఏండ్లుగా సింగరేణి పింఛన్లో ఎలాంటి మార్పులేకుండా నిర్లక్ష్యానికి గురైందన్నారు. కాకా మనుమడు గడ్డం వంశీకృష్ణ ఎంపీగా గెలిచిన తర్వాత సింగరేణి రిటైర్డు కార్మికుల పెన్షన్ పెంపు కోసం పార్లమెంట్‌లో కొట్లాడారని పేర్కొన్నారు.
గతంలో టన్నుకు రూ.10 చొప్పున పెన్షన్ నిధికి జమ చేస్తుండగా ఎంపీ కృషితో అదనంగా మరో రూ.10 చొప్పున జమచేసేందుకు సింగరేణి ఒప్పుకుందని, ఫలితంగా తమకు నిరంతరం పెన్షన్ వస్తుందనే ధీమా పెరిగిందని రిటైర్డ్ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మందమర్రి, చెన్నూరు కాంగ్రెస్టౌన్ ప్రెసిడెంట్లు ఉపేందర్‌గౌడ్, సూర్యనారాయణ, లీడర్లు రఘునాథ్‌రెడ్డి, సుదర్శన్, లక్ష్మణ్, హేమంతరెడ్డి, శ్రీనివాస్, కర్ణసాగర్రావు, రాజమల్లు గౌడ్, మహేశ్తివారీ, మారుతీ, సురేశ్‌యాదవ్, సుధాకర్, రమేశ్, రజని, నర్సింగ్, తిరుమల్‌రెడ్డి, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆ ఘనత ఎంపీ వంశీకృష్ణదే
తమ పెన్షన్ నిధిని రూ.140 కోట్లకు పెంచేలా కృషి చేసిన ఘనత పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణదేనని సింగరేణి రిటైర్డ్ కార్మికులు పేర్కొన్నారు. శనివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో రిటైర్డ్ కార్మికులు సబ్బని రాజనర్సు, ఎలిగేటి మల్లేశ్, మార్త శంకర్ మాట్లాడారు. ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్‌లో అనేకసార్లు రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంపు అంశాన్ని లేవనెత్తి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని అన్నారు. గతంలో టన్ను బొగ్గుకు రూ.10 చెల్లించాల్సి ఉండగా, ఎంపీ పోరాటం వల్ల టన్నుకు రూ.20కి పెంచారని తెలిపారు. దీంతో మొత్తం రూ.140 కోట్లు కార్మికుల భవిష్య నిధికి జమ చేసిందని పేర్కొన్నారు. ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు.