పెద్దపల్లి ఎంపీ టికెట్ వంశీకృష్ణకు ఇవ్వాలి: నేతల విజ్ఞప్తి

పెద్దపల్లి ఎంపీ టికెట్ వంశీకృష్ణకు ఇవ్వాలి: నేతల విజ్ఞప్తి

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వివేక్ ​వెంకటస్వామి వారసుడు గడ్డం వంశీకృష్ణకు ఎంపీ టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఉనుకొండ శ్రీధర్ పటేల్, బాలసాని సతీశ్ గౌడ్ తదితరులు పార్టీ ​హైకమాండ్​కు, ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రిగా కాకా వెంకటస్వామి, ఎంపీగా ఆయన తనయుడు వివేక్​ వెంకటస్వామి పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేవారని వారు గుర్తుచేసుకున్నారు. విశాక​ ట్రస్ట్ ​ద్వారా గ్రామగ్రామాన అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు.

అలాంటి కాకా కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలన్నారు. కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలంతా ఏకతాటిపై ఉండి, టికెట్​ఇప్పించుకోవడంతో పాటు గెలిపించుకోవాలని వారు కోరారు. మీడియా సమావేశంలో సయ్యద్ సజ్జాద్, అడ్డగుంట శ్రీనివాస్, ఉనుకొండ భూమయ్య, ప్రవీణ్, ఇమ్రాన్, నరెందర్ రెడ్డి, బండి రాజు, తోట మహేశ్​ తదితరులు పాల్గొన్నారు.