- 12 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ నేతల ధీమా
- ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా రావడంతో బీఆర్ఎస్‌లో టెన్షన్
- 2018 ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా తగ్గిన పోలింగ్ శాతం
- మరో 24 గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
నల్గొండ, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఫలితాలపై అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. ఈ మేరకు బూత్‌ల వారీగా పోలైన ఓట్ల లెక్క తీసి.. తమకు ఎన్ని పడ్డాయో అంచనాకు వస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడంతో ఆ పార్టీ అభ్యర్థులు, నేతలు ఉమ్మడి జిల్లాలోని12 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులు, నేతలు మాత్రం టెన్షన్ పడుతున్నారు.
గెలిచే పరిస్థితి లేనివాళ్లు ఇప్పటికే సైలెంట్ అయిపోగా.. టఫ్ ఫైట్ ఉన్న అభ్యర్థులు మాత్రం స్వల్ప మెజార్టీతోనైనా బయటపడతామని క్యాడర్‌తో చెబుతున్నారు. కాగా, అధికారులు పోలింగ్ ముగియకాగానే ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచి సీజ్ చేశారు. మరో 24 గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది.
కొన్నిచోట్ల పెరిగిన పోలింగ్ శాతం
2018 ఎన్నికలతో పోలిస్తే ఓవరల్‌గా పోలింగ్ శాతం స్వల్పంగా తగ్గినప్పటికీ.. నియోజకవర్గాల వారీగా చూసుకుంటే మెజార్టీ స్థానాల్లో పోలింగ్భారీగా పెరిగింది. 12 నియోజకవర్గాల్లో 29,00,249 మంది ఓటర్లు ఉండగా, 25,09,411 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పోలిస్తే యాదాద్రి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 2018తో పోలిస్తే పోలింగ్పర్సంటేజీ 0.03 శాతం పెరిగింది. జిల్లాల వారీగా పోలింగ్ పర్సంటేజీలో స్వల్ప హెచ్చుతగ్గులు మినహా, దాదాపు అన్ని చోట్ల 80 శాతం పోలింగ్‌నమోదైంది.
బూత్‌ల వారీగా లెక్కలు
ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్పర్సంటేజీ పెరగడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్అభ్యర్థులు బూత్‌ల వారీగా పోలై న ఓట్ల గురించి లెక్క కడుతున్నారు. ఆయా బూత్‌లో పోలైన ఓట్లలో ఏ పార్టీకి ఎన్ని పడ్డాయి? కొత్త ఓటర్లు, యువకులు, ఉద్యోగులు ఎటువైపు మొగ్గు చూపారు? గ్రామాల్లో బీఆర్ఎస్ స్కీమ్‌లు ఏమేరకు ప్రభావితం చేశాయి ? పట్టణ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు ? అనే కోణాల్లో విశ్లేషిస్తున్నారు.
ఓటర్లకు, డబ్బు, మద్యం పంపిణీ చేయడంపై చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో సగటున ఓటుకు రూ. వెయ్యి వరకు పంపిణీ చేసినట్టు తెలిసింది. గట్టి పోటీ ఉన్న మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, ఆలేరు, భువనగి రి నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ రూ.2వేల వరకు పంపిణీ చేసినట్టు సమాచారం. ప్రతి ఇంటికి చికెన్, మటన్ కూడా పంపిణీ చేశారు. కానీ ఇవి మేరకు ప్రభావితం చేస్తాయో చూడాలి.
జోరుగా బెట్టింగ్‌లు
ఏ పార్టీ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తదనే దాని పైన అక్కడక్కడ బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పక్కాగా గెలుస్తదని భావించే స్థానాల్లో బెట్టింగ్‌ల జోరు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. టఫ్ ఫైట్ తప్పదన్న నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు మెజార్టీపై బెట్టింగ్‌లు రూ.50వేల నుంచి రూ.2 లక్షల వరకు కడుతున్నట్లు సమాచారం.
బీఆర్‌ఎస్ నేతల్లో టెన్షన్
2018 ఎన్నికల్లో కుప్పకూలిన కాంగ్రెస్ కంచుకోటలు మళ్లీ పట్టు బిగిస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతుండడంతో ఆ పార్టీ నేతల్లో జోష్ నెలకొంది. 12 సీట్లు గెలుస్తున్నామని ఎంపీ కోమటిరెడ్డి శుక్రవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. నకిరేకల్ అభ్యర్థి వేముల వీరేశం అప్పుడే రాజకీయ విమర్శలకు పదును పెట్టారు. బీఆర్ఎస్‌కు రెండు నుంచి నాలుగు సీట్లే ఎగ్జిట్ పోల్స్ చెబుతుండడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మిర్యాలగూడ, సూర్యాపేట
తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి సీట్ల పైన బీఆర్ఎస్ నమ్మకం పెట్టుకుంది. కానీ, ఇక్కడ టఫ్ ఫైట్ ఉండడంతో ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మిగితా చోట్ల కాంగ్రెస్ హవా కనిపిస్తుండడంతో అక్కడి అభ్యర్థులు సైలెంట్ అయిపోయారు.
నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లు, శాతం
నియోజకవర్గం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు శాతం
దేవరకొండ 2,51,622 2,12,593 84.49
నాగార్జునసాగర్ 2,33,412 2,00,235 85.79
మిర్యాలగూడ 2,31,391 1,93,185 83.49
నల్గొండ 2,44,460 1,99,479 81.60
మునుగోడు 2,52,648 2,32,158 91.89
నకిరేకల్ 2,50,547 2,17,149 86.67
హుజూర్నగర్ 2,47,592 2,14,012 86.44
కోదాడ 2,41,554 2,06,676 85.56
సూర్యాపేట 2,41,799 2,03,624 84.21
తుంగతుర్తి 2,55,017 2,23,496 87.64
ఆలేరు 2,33,266 2,11,744 90.77
భువనగిరి 2,16,941 1,95,060 89.91
జిల్లాల వారీగా పోలింగ్ పర్సంటేజీ
జిల్లాపేరు 2018 2023 తేడా
నల్గొండ 86.82 85.71 -1.11
సూర్యాపేట 86.55 85.99 -0.56
యాదాద్రి 90.33 90.36 +0.03