- ప్రభుత్వం రుణమాఫీ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని అమలు చేయడంతో.. మాజీ మంత్రి హరీశ్ రావు రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని లోక్‌సభ ఎన్నికల ముందు హరీశ్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఆ లోపే రుణమాఫీ చేయడంతో ఇక హరీశ్ రిజైన్ చేయాల్సిందేనని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. ‘రాజీనామా చేసేందుకు హరీశ్‌కు పేపర్ దొరికింది కాని.. పెన్ను దొరకలేదా?’ అని శుక్రవారం ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
‘ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో హరీశ్ కు పెట్రోల్ దొరికింది కానీ.. అగ్గి పెట్టె దొరకలేదు.. ఇప్పుడు రాజీనామా చేసేందుకు పేపర్ మాత్రమే దొరికింది.. సంతకం పెట్టేందుకు పెన్నే దొరకలేదు’ అని మాజీ ఎంపీ మధు యాష్కీ ఎద్దేవా చేశారు. ‘కాషాయ వస్త్రాలు పంపిస్తాం.. సన్యాసం తీసుకో..’ అంటూ హరీశ్‌కు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సూచించారు. హరీశ్ తన మాటకు కట్టుబడి రాజీనామా చేయాల్సిందేనని జగిత్యాలలో మీడియా ముందు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
రుణమాఫీని అమలు చేసి.. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే రోల్ మోడల్ గా నిలిచిందని, హరీశ్ ఇక రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి శుక్రవారం గాంధీ భవన్ లో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హరీశ్ రావు గన్ పార్కు వద్దకు వచ్చి ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాలని తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్‌చేశారు.