నల్గొండ, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున తామే ఎక్కువ సీట్లు సాధిస్తామంటే.. కాదు తామే సాధిస్తామంటూ అగ్రనేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుతుండడం ఆసక్తి రేపుతోంది. నిన్నమొన్నటి వరకు ఉప్పునిప్పులా ఉన్న కాంగ్రెస్ సీనియర్లు నల్గొండ నిరుద్యోగ సభ ద్వారా ఒకే వేదికపై రావడం, విజయంపై పోటాపోటీ శపథాలు చేయడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానాలు గెలిచి తమ సత్తా చాటుతామని ఉత్తమ్, వెంకట్ రెడ్డి, జానారెడ్డి నిరుద్యోగ సభలోనే శపథం చేశారు. వెంకటరెడ్డి ఒక అడుగు ముందుకేసి నల్గొండ జిల్లాలో ఫస్ట్‌టైం అడుగుపెట్టిన రేవంత్‌కు రిటర్న్ గిఫ్ట్ కచ్చితంగా ఇవ్వాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. రేవంత్ సొంత జిల్లా మహబూబ్ నగర్లో తొమ్మిది స్థానాల కంటే అదనంగా నల్గొండ జిల్లాలో ఒకటి, రెండు సీట్లు ఎక్కువే గెలిపించి చూపిస్తామని, ఇందుకు సీనియర్లంతా కలిసి కట్టుగా ఫైట్ చేస్తామన్నారు. కాగా, ఇది కేవలం క్యాడర్లో ఉత్సాహం నింపేందుకేనా? గెలిస్తే సీఎం కుర్చీ ఎవరిదో కూడా సీట్లే తేల్చనున్నాయా? అనే అంశం పై పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్‌కు కీలకంగా దక్షిణ తెలంగాణ
కాంగ్రెస్ హైకమాండ్ దక్షిణ తెలంగాణపై ఆశలు పెట్టుకున్నది. ముఖ్యంగా పార్టీ అగ్రనేతల సొంత జిల్లా ఉమ్మడి నల్గొండపై అందరి దృష్టి నెలకొంది. ఈ జిల్లాలో 12 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టేనని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. దక్షిణ తెలంగాణగా భావించే నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో కలిపి 31 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వీటిలో నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా 12 సెగ్మెంట్లున్నాయి. కీలక నేతలు ఉత్తమ్, వెంకట్ రెడ్డి, జానారెడ్డి ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండడం, ఇక్కడ లీడర్లతో పాటు బలమైన క్యాడర్ ఉండడం కాంగ్రెస్‌కు కలిసివస్తుందనే అంచనాలున్నాయి. రేవంత్ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలపై కన్నేసి గ్రౌండ్‌వర్క్ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మంలోనూ సీనియర్‌నేత భట్టి విక్రమార్క కూడా రాబోయే ఎన్నికల్లో పది స్థానాలూ కాంగ్రెస్ ఖాతాలో పడ్తాయని, ఆ బాధ్యత తనదే అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆయన రాష్ట్రంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు.
ఆ ఐదుగురూ సీఎం రేసులో..
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఈ మూడు జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు సీనియర్లు సీఎం రేసులో ఉండనున్నారు. దీంతో ఇంట గెలిచి రచ్చ గెలవాలనే ఆలోచనతో లీడర్లంతా సొంత జిల్లాల్లో క్లీన్‌స్వీప్‌పై ఫోకస్ పెట్టినట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ వర్గానికి ఛాన్స్ ఇవ్వకుండా తాము అనుకున్న క్యాండిడేట్లకే టికెట్లు ఇచ్చి గెలిపించుకునేలా వ్యూహం రూపొందిస్తున్నారు. కానీ, ఇటీవల జానారెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలు వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలవరపెడుతున్నాయి. సీఎం పదవిపై జానా ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని భావించినప్పటికీ చివరికి సీఎల్పీ లీడర్‌గానే మిగిలిపోయారు. ఇక, 2018 ఎన్నికల్లో గెలిస్తే పీసీసీ చీఫ్ హోదాలో తమకు సీఎం ఛాన్స్ వస్తుందని ఉత్తమ్ కుమార్ ఆశించి భంగపడ్డారు. ఉత్తమ్ పీసీసీ చైర్ నుంచి తప్పుకుంటే తనకు ఆ ఛాన్స్వస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశించినా ..రేవంత్ ఎంట్రీతో ఆ కల నెరవేరలేదు. పీసీసీ చీఫ్ రేవంత్‌తో పాటు అవకాశం వస్తే తాను కూడా సీఎం రేసులో ఉంటానని సీఎల్పీ లీడర్‌గా ఉన్న భట్టి తన సన్నిహితులతో చెప్తున్నారు. ఈ క్రమంలో తమ జిల్లాల్లో మెజారిటీ సీట్లను గెలిపించుకోవడం ద్వారా హైకమాండ్ వద్ద పై చేయి సాధించాలనే వ్యూహంలో సీనియర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌కు కలిసివచ్చేనా?
ఉమ్మడి నల్గొండలో 12, ఖమ్మంలో 10, మహబూబ్‌నగర్ లో తొమ్మిది నియోజకవ ర్గాలున్నాయి. గతంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ మూడు(ప్రస్తుతం 10) జిల్లాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ హవా నడుస్తోంది. కాగా, ప్రభుత్వ వ్యతిరేకత, ఈ పది జిల్లాల పరిధిలో సీఎం ఇచ్చిన అనేక హామీలు నెరవేరకపోవడం, ముఖ్యంగా పాలమూరు– రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, ఇతర సాగు, తాగునీటి ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యం, ఎమ్మెల్యేల భూ కబ్జాలు, ఇసుక, లిక్కర్ మాఫియా లాంటివన్నీ తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా ఇష్యూస్‌ను ప్రచార అస్త్రాలుగా చేసుకొని ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్త లీడర్లను పార్టీలో చేర్చుకునే దిశగా పావులు కదుపుతున్నారు. ఇటీవల రూలింగ్ పార్టీ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం ద్వారా ఖమ్మం, మహబూబ్‌నగర్‌జిల్లాల్లో పార్టీ బలం మరింత పెంచుకోవాలని భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్‌లో సహజంగా ఉండే గ్రూపు తగాదాలు, సీనియర్ల ఆధిపత్య పోరాటం, గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరడం లాంటి అంశాలు ఆ పార్టీకి మైనస్. వీటిని దాటుకొని దక్షిణ తెలంగాణలో గెలిచే సీట్ల ఆధారంగానే సీనియర్లతో పాటు కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.